Mamidipally Lands | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): భూముల అమ్మకం.. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న కీలకమైన టాస్క్ ఇది. హెచ్‌సీయూ భూములను తాకట్టు పెడితేనే రూ.10 వేల కోట్లు రావడంతో, వాటిని అమ్మేస్తే అంతకంటే ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ, అనూహ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగడం, వారికి తెలంగాణ సమాజంతోపాటు దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కూడా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రస్తుతం బంతి సుప్రీంకోర్టులో ఉన్నందున భూములను అమ్మే దారులు దాదాపు మూసుకుపోయాయని అధికారులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ‘ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు ఇచ్చిన మరో ల్యాండ్బ్యాంక్పై ప్రభుత్వం దృష్టిసారించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల, బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న 468 ఎకరాలపై తాజాగా అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చౌకగా వందలాది ఎకరాల భూములను ‘ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్’కు కట్టబెట్టారు. చంద్రబాబు సర్కారు 2003లో కంచ గచ్చిబౌలిలో హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలతోపాటు ఇదే జిల్లాలోని రావిర్యాల, మామిడిపల్లి పరిధిలోని దాదాపు 468 ఎకరాలను కూడా కట్టబెట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 2006లో ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో ‘ఐఎంజీ’ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సైతం ఆ భూముల కోసం కోర్టులో వాదనలు వినిపించడం ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కలిసొచ్చింది.
గత ఏడాది మార్చిలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆ భూములు సర్కారువేనని స్పష్టంచేయడంతో తొలుత కంచ గచ్చిబౌలి భూములపై సర్కారు దృష్టిసారించింది. తదుపరి పరిణామాల నేపథ్యంలో ఆ భూముల వ్యవహారంపై ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అంతేకా కుండా తాము అధికారంలోకి రాగానే 400 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు చేస్తామని, రేవంత్ ప్రభుత్వం విక్రయించినా తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వాటిని ఎవరూ కొనుగోలు చేయవద్దని కేటీఆర్ పార్టీపరంగా స్పష్టంచేశారు. దీంతో ఆ భూముల వ్యవహారం ఇప్పట్లో తెగేలా లేదనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది.
‘ఐఎంజీ అకాడమీస్ భారత’కు ఇచ్చిన భూములు బాలాపూర్ మండలం మామిడిపల్లి, మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామాల్లో విస్తరించి ఉన్నాయి. రావిర్యాలలోని సర్వే నంబర్ 1/1లో 86.34 ఎకరాలు, మామిడిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 99/1లో 420 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో నుంచే చంద్రబాబు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. గత ఏడాది మార్చిలో తీర్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములపై దృష్టిసారించింది. ఇందులో దాదాపు 200 ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. భారీ పోలీసు బలగాలను మోహరించి వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అయితే, ఇందులో మహారాజ్ రాజాసింగ్ మనవరాలు షాలిని కూడా ఉన్నట్టు తెలిసింది.
ఆ భూమి తనదేనంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు స్థానికులు చెప్తున్నారు. కాగా, ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత టీజీఐఐసీ ఆధ్వర్యంలో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. అంతేకాకుండా ఆ భూములు టీజీఐఐసీకి చెందినవంటూ బోర్డులు ఏర్పాటుచేసింది. అయితే రికార్డుల్లో మాత్రం ఆ భూమి హక్కులు రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి బదలాయింపు జరగలేదని సమాచారం. కంచ గచ్చిబౌలి తర్వాత దీనిపై దృష్టిసారించాలనుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఈ భూములను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కంచ గచ్చిబౌలిలో పరిస్థితి ప్రతికూలంగా మారడంతో గత రెండు, మూడు రోజులుగా ఇక్కడ కదలిక మొదలైంది.
ఈ భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ పంపాల్సిందిగా ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ భూ రికార్డులు ఎలా ఉన్నాయి? ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలపై జిల్లా యంత్రాంగం ఆరా తీస్తున్నది. రికార్డుల పరిశీలన పూర్తయ్యాక అధికారికంగా టీజీఐఐసీ కి భూ బదలాయింపు జరిగే అవకాశాలున్నా యి. ఆ తర్వాత ప్రభుత్వం ఈ భూములను తాకట్టు పెడుతుందా? నేరుగా అమ్ముతుం దా? అనేది చర్చనీయాంశంగా మారింది.