హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): అటవీ ఉత్పత్తులను సేకరించి, ప్రాసెస్ చేసి, మార్కెట్లోకి విక్రయించడం ఆదాయం సమకూర్చడం కోసం, గిరిజనులకు అండగా నిలిచేందుకు గిరిజన సహకార సంస్థ-జీసీసీ తోడ్పడుతుంది. కార్పొరేషన్లో 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరందరినీ భాగస్వాములను చేస్తూ వినూత్న పద్ధతుల్లో గిరిజనులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఏడాది పాలనలో జీసీసీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయని గిరిజన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిధులు కేటాయించాలని జీసీసీ అధికారులు పలుసార్లు ప్రభుత్వాన్ని సంప్రదించినా ఫలితం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా తామేమీ చేయలేకపోతున్నామని కొందరు అధికారులు గిరిజన సంఘాల నేతలకు స్పష్టంచేస్తున్నారు. దీంతో కార్పొరేషన్ మనుగడ ప్రశ్నార్థకమైంది.
నిధులు కేటాయించని నిర్లక్ష్యం
నిధులు లేకపోవడంతో జీసీసీ కార్యకలాపాలు నిలిచిపోయాయని గిరిజన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కార్పొరేషన్ మనుగడ సాగాలంటే కనీసం 30 కోట్ల నిధులు అవసరముందని అధికారులు చెప్తున్నారు. ఈ డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. కనీసం కొత్త బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారన్న ఆశతో మరోసారి జీసీసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. వీటిని ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు.
ఇబ్బంది పడుతున్న సిబ్బంది
ఏడాదిగా అటవీ ప్రాంతాల నుంచి ఉత్పత్తులు సేకరణ దాదాపు నిలిచిపోయింది. కేవలం సబ్బులు తయారు చేయడం చేసే ప్రక్రియ ఒక్కటే నడుస్తున్నది. ఆ సబ్బులను కూడా మార్కెట్లో విక్రయించడం లేదు. కేవలం ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఆదాయం కూడా స్పల్పంగానే వస్తున్నది. జీసీసీలోని దాదాపు 300 సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవని అధికారులు వాపోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని, జీసీసీ సమస్య పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీసీసీ మనుగడ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గాలు అన్వేషించాలని కోరుతున్నారు.