నర్సింహులపేట, మే 6 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను అధికారులు తరలించారు. ‘కాంటా ఇంకెప్పుడు పెడ్తరు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కాంటాల నిర్వహణ పెంచాలని, లారీల్లో మిల్లులకు ధాన్యం తరలించాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రెవెన్యూ అధికారులు జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపి ధాన్యం బస్తాలు తరలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం వచ్చిన 140మంది రైతులకు టోకెన్లు జారీచేశారు. సీరియల్ ప్రకారం మాత్రమే కాంటాలు నిర్వహించాలని, రైతుల పేర్లు బోర్డుపై అంటించడంతో రైతులు సంతృప్తి వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. మార్కెట్కు ధాన్యం తెచ్చి 25 రోజులైనా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ మండలంలోని శనిగపురం, ముడుపుగల్ కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -మహబూబాబాద్ రూరల్