హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించేందుకు అధికారులు సైతం జంకుతున్నారు. పూర్తిగా విముఖత చూపుతున్నారు. తాజాగా అదనపు బాధ్యతలు సైతం స్వీకరించేందుకు ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయేంద్ర బోయి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య స్థానంలో మూడు నెలల క్రితమే విజయేంద్ర బోయిని ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె వ్యక్తిగత సెలవులపై వెళ్లారు. దీంతో వెంటనే కృష్ణఆదిత్యకే తదుపరి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో గత నెలలో జరిగిన బదిలీల్లో విజయేంద్ర బోయిని ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా గురుకుల సొసైటీ కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటికీ ఆమె సెలవులోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాత్కాలికంగా సొసైటీ జాయింట్ సెక్రటరీ శారదకు ఇన్చార్జి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. దాదాపు నెలరోజుల తర్వాత ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విజయేంద్ర బోయి బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు మాత్రం స్వీకరించలేదని తెలుస్తున్నది. అందుకు సంబంధించిన ఫైల్స్‌ను కూడా చూసేందుకు నిరాకరిస్తున్నారని సొసైటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రెండున్నరేండ్ల కాలంలో ముగ్గురు కార్యదర్శులు మారారు. తొలుత అలగు వర్షిణిని ప్రభుత్వం నియమించగా, ఏడాదికే ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆమె స్థానంలో కృష్ణ ఆదిత్యకు సొసైటీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత విజయేంద్ర బోయిని పూర్తికాలపు సెక్రటరీగా 3 నెలల క్రితమే సర్కార్ నియమించింది. విధుల్లో చేరిన వెంటనే ఆమె సెలవుపై వెళ్లడంతో జేఎస్ శారదరకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. గురుకులంలో నెలకొన్న సమస్యలు, ప్రధాన కార్యాలయంలో తిష్టవేసిన పలువురు ఉన్నతాధికారుల తీరుకు తోడు టెండర్ల ప్రక్రియకు దూరంగా ఉండేందుకే అందరూ విముఖత చూపుతున్నారని సొసైటీలో చర్చ జరుగుతున్నది.