గజ్వేల్, ఏప్రిల్ 10: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయని తన దృష్టికి వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ములుగు మండలంలోని పలు గ్రామాల్లో సాగునీరులేక పొలాలు ఎండిపోతున్నాయనే విషయాన్ని రైతులు రెండు రోజుల క్రితం డీసీసీబీ మాజీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్ తక్షణమే స్పందించి ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి కర్కపట్ల కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించారు. వెంటనే ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఈ అంజలి కర్కపట్ల వద్ద కెనాల్‌ను గురువారం మధ్యాహ్నం పరిశీలించి సాగునీటిని విడుదల చేశారు. దీంతో ములుగు మండల పరిధిలోని కొట్యాల, అల్లీనగర్, అడవిమజీద్, నర్సంపల్లి, క్షీరసాగర్, జప్తి సింగాయిపల్లి గ్రామాల రైతులు సాగు చేసిన వరికి ప్రయోజనం కలుగుతుంది. పొట్ట దశ లో పంటకు మరో 20 రోజులపాటు నీళ్లు తప్పకుండా అందించాల్సిన సమయంలో సమస్య కేసీఆర్ దృష్టికి వెళ్లింది. కేసీఆర్ అధికారులతో మాట్లాడగానే కాలువలోకి సాగునీళ్లు పరవళ్లు తొక్కడంతో రైతులు సంబురపడ్డారు. సాగునీటి విడుదలకు కృషిచేసిన కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.