హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమ సరోగసీ రాకెట్‌పై ఈడీ దర్యాప్తు షురూ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న కీలక నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, ముత్తిపేట నందిని, ధనశ్రీ సంతోషి, చిటిక్కిరెడ్డి కల్యాణిలను బుధవారం ఈడీ అధికారులు ప్రశ్నించారు. తెలంగాణలో వెలుగుచూసిన ఈ రాకెట్ మోసాలు పలు రాష్ర్టాలకు విస్తరించడం, నిందితుల మధ్య కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తేలడంతో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, పలు కీలక ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగా నిందితులను ప్రశ్నించేందుకు అనుమతి కోరడంతో ఈ నెల 28 వరకు విచారించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో బుధవారం ఈడీ అధికారుల బృందం చంచల్‌గూడ జైలులో నిందితులను విచారించింది. మోసం, క్రిమినల్ కుట్ర, అక్రమ సరోగసీ, శిశువుల అక్రమ రవాణా తదితర ఆరోపణలపై తొలిరోజు వారిని లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది.
పీఎంఎల్ఏ కింద ఈడీ సోదాలు
పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు గత నెలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో డాక్టర్ నమ్రత ఆస్తుల వివరాలతోపాటు ఆమె చేతిలో మోసపోయిన దంపతులకు సంబంధించిన కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, బెంగళూరు, కోల్‌కతా తదితర నగరాల్లో అనేకమంది దంపతులకు డాక్టర్ నమ్రత సరోగసీ సేవలను అందించినట్టు ఆ పత్రాల ద్వారా తేలింది. దీంతో ఆ బాధితుల వివరాలు కూడా సేకరించారు.
సృష్టి ఫెసిలిటీ సెంటర్ అక్రమాలపై హైదరాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ లోతుగా దర్యాప్తు జరుపుతున్నది. ఆగస్టులో వెలుగులోకి వచ్చిన ఈ రాకెట్.. ఫేక్ ఐవీఎఫ్, సరోగసీ ప్యాకేజీల పేరుతో అనేక మంది దంపతులను మోసగించడంతోపాటు శిశువుల అక్రమ రవాణా, రికార్డుల ఫోర్జరీ లాంటి అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సృష్టి ఫెర్టిలిటీ క్లినిక్ లైసెన్సు 2021లోనే రద్దయినప్పటికీ అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కూడా దర్యాప్తు చేస్తున్నది.