రంగారెడ్డి, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చిన వ్యవహారంపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘సర్కార్ భూమి…. సమర్పయామి’ శీర్షికతో మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఆర్ఐ ప్రేమ్‌కుమార్ తదితరులు మునగనూరు గ్రామానికి వెల్లి భూమిని పరిశీలించారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మునగనూరు గ్రామంలోని సర్వే నంబర్ 44లో గల 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చింది వాస్తవమేనని చెప్పారు. ఈ వ్యవహారంపై బుధవారం వరకు పూర్తిస్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. పట్టా మార్పిడీ జరిగిన వ్యవహారంతోపాటు నాలాగా మార్చిన వ్యవహారంపై కూడా పూర్తి నివేదిక అందజేస్తామని వెల్లడించారు.
ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టర్ అనుమతితో 44 సర్వే నంబర్లో గల 12 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి మాత్రం 44 సర్వే నంబర్లోని 12 ఎకరాలను ఎవరూ కబ్జా చేయలేదని, తమ ఆధీనంలో ఉన్నదని చెప్పడం కొసమెరుపు. ఈ భూమిలో సుమారు రెండెకరాల్లో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కబ్జా చేసి లారీలను పార్కింగ్ చేస్తూ భూమిని ఆక్రమించుకున్నాడు. అలాగే, ఈ భూమిని తమ పేర ్లమీద మార్చుకున్న వ్యక్తులు ఈ భూమిని మరొకరికి విక్రయించేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నారు. కాగా, రికార్డులో పేర్లు మార్పిడీ చేసుకున్నవారు ఈ భూమి తమదేనంటూ పలుమార్లు అక్కడికి వచ్చిపోతున్నారు. కానీ, అధికారులు మాత్రం భూమి తమ ఆధీనంలో ఉన్నదని చెప్తున్నారు. వెంటనే ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేయాలని స్థానికులు కోరుతున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 44లోని 40.10 ఎకరాల విస్తీర్ణాన్ని 22ఏ నిషేధిత జాబితాలోనే పొందుపరిచామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టంచేశారు. సర్వే నంబర్లో ఐదు సబ్ డివిజన్లు ఉన్నాయని, అందులో రెండు సబ్ డివిజన్లను నిషేధిత జాబితాలోని వ్యవసాయ భూముల విభాగంలో పొందుపరిచామని వివరించారు. 44/4లో 7.16 ఎకరాలు, 44/5లో 18.10 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ భూమి (గవర్నమెంట్ ల్యాండ్)గా నమోదు చేశామని పేర్కొన్నారు. వ్యవసాయేతర భూముల విభాగంలో 44/1లో 8.39 ఎకరాలు గృహాలు, 44/2లో 4.25 ఎకరాలు కోర్టు వివాదం, 44/3లో ఎకరం భూమి తొర్రూర్-హయత్‌నగర్ జడ్పీ రోడ్డుగా నమోదు చేశామని వెల్లడించారు. తాను వచ్చినప్పటి నుంచి సదరు సర్వే భూమిలో లావాదేవీలు జరుగలేదని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు నిషేధిత జాబితా పంపే సమయం నాటికి ఉన్న వాస్తవ వివరాలు జాబితాలో ఉంచామని తెలిపారు.
మునగనూరు గ్రామంలో సుమారు రూ.200 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అక్రమంగా మరికొంతమంది వ్యక్తులకు పట్టాలుగా మార్చిన వ్యవహారం జిల్లా అధికార యంత్రాంగాన్ని కుదిపివేసింది. నగర శివారుల్లోని ప్రభుత్వ భూములు రోజుకోచోట పట్టాలుగా మారుతూ.. ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకుంటున్నారని, ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు తహసీల్దార్లంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ, కొంతమంది తహసీల్దార్లు రెవెన్యూ రికార్డుల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను ఇతరులకు ధారాదత్తం చేస్తున్నారు. మునుగనూరులోనూ 12 ఎకరాల భూమిని రికార్డులు మార్చి పట్టాగా మార్చారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. రెండ్రోజుల్లో ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది.
మునగనూరు గ్రామంలోని సర్వే నంబర్ 44లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు పట్టా చేయించుకున్నారు. ఈ విషయంపై నిజ నిర్ధారణ కోసం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు పలువురు ప్రతినిధుల బృందం బుధవారం మునుగనూరులో పర్యటించనున్నారు. మునగనూరులోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు అధికారుల సహకారంతో కొంతమంది వ్యక్తులు సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కాజేయాలని చూస్తున్నారని, ఈ భూములపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ భూమిని పరిరక్షించే వరకు పోరాడుతామని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.