హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రైవేట్ వాహనాలపై అనధికారికంగా మానవ హకులకు సంబంధించిన హో దాలను, ప్రభుత్వ చిహ్నాలను, అడ్వకేట్, ప్రెస్ గుర్తులను ప్రదర్శించడంపై రాష్ట్ర మానవ హకుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. కమిషన్‌కు సంబంధం లేని వ్యక్తులు చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలను మోసగించేలా వాహనాలకు నకిలీ స్టిక్కర్లు వేసుకొని తిరగడంపై వెంటనే చర్యలు చేపట్టాలని ఎస్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రిజిస్టర్ అయిన 3 వాహనాలపై అనధికారిక చిహ్నాలను కమిషన్ గమనించింది.
టీఎస్17టీ 3437 నంబర్ కారుపై ‘స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్’ అనే స్టిక్కర్, అడ్వకేట్ చిహ్నం, అశోక చిహ్నం, ఎరుపు రంగులో ‘ప్రెస్’ అనే స్టికర్‌ను ప్రదర్శించినట్టు గుర్తించింది. నకిలీ హో దాల ప్రదర్శనను, ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు చేపట్టిన చర్యలపై నవంబర్ 24లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. అనధికారిక సైరన్లు, చిహ్నాలు, నకిలీ హోదాలను వినియోగించేవారిపై ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని డీజీపీకి స్పష్టం చేసింది. అనధికార మార్పులు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని రవాణా కమిషనర్‌ను ఆదేశించింది.