Panchayati Workers | తొర్రూరు, ఏప్రిల్ 17 : జీతాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరినందుకు గ్రామపంచాయతీ కార్మికులను పనిలోకి రావొద్దని చెప్పిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో జరిగింది. బుధవారం చర్లపాలెం పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని జీపీ కార్మికులు ధర్మారపు వెంకటమ్మ, జయమ్మ, చింతకుంట్ల సత్తయ్య, చిట్టిమల్ల సాయిలు, ధర్మారపు మల్లమ్మ, ధర్మారపు మైబ కలిశారు. తమకు ఏడాదికాలంగా జీతాలు రావడంలేదని, వెంటనే ఇప్పించాలని కోరారు. దీంతో సదరు ఐదుగురిని గురువారం నుంచి విధులకు రావొద్దని అధికారులు చెప్పడం గమనార్హం.
నేను చర్లపాలెం జీపీలో ఏడేండ్లుగా పని చేస్తున్నా. ఏడాదిగా జీతాలు వస్తలేవు. ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఇప్పిస్తాం అంటూ కాలం గడుపుతున్నారు. బుధవారం చర్లపాలెంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి రావడంతో సమస్యను చెప్పుకొన్నా. అమ్మా, జీతాలు రావడం లేదు. ఒకసారి చూడండి.. అని బతిమిలాడా.. నువ్వు ఎమ్మెల్యేకు ఎలా ఫిర్యాదు చేస్తావు’ అని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి గురువారం నుంచి పనిలోకి రావొద్దని చెప్పారు. జీతం అడిగితే ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? ఇదేనా న్యాయం? నేనేమి తప్పు చేశాను? దయచేసి కార్మికుల బతుకులను ఓసారి గమనించండి. ఉద్యోగం తీసేస్తే ఎలా బతికేది?