నిజామాబాద్ జిల్లాలోని ఓ జెడ్పీ హైస్కూల్లో 30 మంది పదో తరగతి విద్యార్థులు వరుసగా డుమ్మాలు కొడుతున్నారు. వార్షిక పరీక్షలు సమీపించడంతో ప్రధానోపాధ్యాయుడు ఆ 30 మంది గైర్హాజరుపై ఆరా తీశారు. వివరాలు తెలుసుకొని ఇక నుంచి గైర్హాజరు కాబోమంటూ అందరూ లేఖలు రాయాలని సూచించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తప్పుల్లేకుండా రాయలేని పరిస్థితి. సదరు హెచ్ఎం డిక్టేషన్ చేయించినా శ్రీయుత అన్న పదంలో శ్రీ అని కూడా సరిగ్గా రాయలేకపోయారు. ఇది క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితి.
కానీ, పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్, ఫార్మేటివ్.. ఏ పరీక్ష పెట్టినా పాస్ మార్కులు వచ్చేస్తున్నాయి. ఇంటర్నల్స్లోను మంచి మార్కులే సాధిస్తున్నారు. వార్షిక పరీక్షల్లోనూ ఫలితాలు ఉత్తమంగానే ఉంటున్నాయి. మరి అసలు విషయం ఏంటి?
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఫలితాలపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు అనుమానం తట్టింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఒకలా ఉంటే ఉత్తమ మార్కులు రావడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వారిలో తలెత్తాయి. అసలు మూల్యాంకనం సక్రమంగా చేస్తున్నారా? లేక ఉపాధ్యాయులు ఇష్టారీతిన మార్కులేస్తున్నారా? అన్న సందేహం వచ్చింది. దీంతో మూల్యాంకనంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆరా తీశారు. పాఠశాల విద్యాశాఖపై ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలోనూ ఇదే విషయంపై ఉపాధ్యాయులను, అధికారులను ఆయన ప్రశ్నంచారు. అంతా సవ్యంగానే జరుగుతున్నట్టుగా ఉపాధ్యాయులు చెప్పారు. అయినా అనుమానం వీడకపోవడంతో విద్యార్థుల జవాబుపత్రాలను తెప్పించుకుని తాను పరిశీలిస్తానన్నారు. ఈ ఏడాది, నిరుటి మూల్యాంకనం చేసిన పేపర్లను తాను పరిశీలిస్తానని సభాముఖంగానే తేల్చిచెప్పారు. ఇలా ఇష్టారీతిలో మార్కులు వేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
సీసీఈ, సహా మూల్యాంకన విధానంపై త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనిని సరిదిద్దాలని విద్యాశాఖకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం రాష్ట్రంలో 2014-15 విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని (సీసీఈ) ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈని అనుసరించి మన రాష్ట్రంలోనూ మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీంట్లో భాగంగా పరీక్షలకు 80, ఇంటర్నల్స్‌కు 20 మార్కులు కేటాయించారు. అయితే విద్యార్థుల్లో కొందరు చదివి, రాయగలిగే సామర్థ్యాలు లేకపోయినా మార్కులు మాత్రం భారీగానే సాధిస్తున్నారు. పదో తరగతిలోనూ ఉత్తీర్ణులవుతున్నారు. ఇలాంటివారు ఇంటర్‌కు వచ్చేవరకు బొల్తా పడుతున్నారు. దీనికి మూల్యాంకన విధానం సక్రమంగా లేకపోవడమే కారణమన్న భావన అధికారుల్లో వ్యక్తమవుతున్నది.
సీసీఈ విధానంలో ప్రస్తుతం నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను పెడుతున్నారని, దీనిని రెండుకు కుదించాలని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా భానుచంద్రప్రకాశ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమ్మేటివ్ పరీక్షలను రెండుగానే కొనసాగించాలని ఆయన సూచించారు.