కురవి, మే 23 : అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా అయిన బస్తాల్లోని వడ్లు వర్షానికి తడిసి మొలకలెత్తాయి. బాదావత్ యుగేందర్ అనే రైతుకు చెందిన ధాన్యం కాంటా అయిన బస్తాలను టార్పాలిన్లు పెట్టి నిల్వ ఉంచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాలు మొలకెత్తాయి. ఓ రైతు 15 రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకురాగా, ఐదు రోజుల క్రితం కాంటాలు పెట్టారు. తరలింపులో జాప్యం చేయడంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. మరికొంత ధాన్యం కొనుగోలు కేంద్రంలో నింపిన బస్తాల్లోనే మొలకెత్తింది.
వేల్పూర్/ముప్కాల్: బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, ముప్కాల్ మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయి, మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి రోడ్లపై ఆరబోసిన వడ్లకు మొలకలు వచ్చాయని వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన తాల్కల చిన్న రాజన్న ఆవేదన వ్యక్తంచేశాడు. వరుసగా కురుస్తున్న వర్షాలకు వడ్లకు మొలకలు వస్తున్నాయని ముప్కాల్ మండలానికి చెందిన దండుగుల పోశెట్టి అనే కౌలు రైతు వాపోయాడు. అటు ప్రభుత్వం, ఇటు సీడ్ ఇచ్చిన వారు కూడా ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆత్మకూర్.ఎస్: ‘ఇష్టముంటే కేం ద్రంలో ఉంచు.. లేకపోతే ధాన్యాన్ని తీసుకెళ్లు’ అంటూ ఐకేపీ కేంద్రం నిర్వాహకులు హుకూం జారీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామానికి చెందిన రైతులు ఐకేపీ కేంద్రానికి ధాన్యం తెచ్చి ఇబ్బంది పడుతున్నారు. కేంద్రంలో సరిపడా గోనెసంచులు లేవని, కాంటాలు వేయకపోవడంతో అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు నచ్చిన వారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, తమ ధాన్యం రెండు నెలలైనా కొనుగోలు చేయలేదని విలపించారు. పండించిన పంట ఒక ఎత్తు అయితే, పంటను అమ్మాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.