హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి మున్సిపల్ కమిషనర్లను హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో 142 మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో ఆశించిన విధంగా పన్నులు వసూలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.
మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్లు పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో 48 మున్సిపల్ కమిషనర్లు, 300 టౌన్‌ప్లానింగ్ అధికారులను నియమించబోతున్నట్టు తెలిపారు. సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి కొత్తగా అమల్లోకి రానున్న ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌తో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. భవనాల అనుమతుల విషయంలో ప్రస్తుత ఫీజులు పెంచే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.