Lower Manair Dam | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : గోదావరి ఎగువన ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారింది. రాష్ట్రంలో వర్షాలు స మృద్ధిగా పడుతున్నా ఎస్సారెస్పీలో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేకుండా పోయాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో ఎల్ఎండీ ఎగువ ఆయకట్టుకే నీరందే పరిస్థితి ఉన్నదని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఎస్సారెస్పీకి జలాలు రాకుంటే ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు సాగునీరందించడం కష్టమేనని తేల్చిచెప్తున్నారు. 2024-25 వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఏమేరకు సాగునీటిని అందించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్ర ణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈ కేఎస్ఎస్ చంద్రశేఖర్ నేతృత్వంలో శనివారం ప్రత్యేక సమావేశమై, యాక్షన్ప్లాన్పై టెరిటోరియల్ వారీగా ఆయా చీఫ్ ఇంజినీర్ల నుంచి ఈఎన్సీ వివరాలు తెలుసుకున్నారు.
కృష్ణ బేసిన్లో ఢోకాలేదు..
ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణంపై సమావేశంలో చర్చించారు. కృష్ణాబేసిన్‌లో ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రతోపాటు, రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కృష్ణాబేసిన్ ఆయకట్టుకు ఢోకా లేదని అధికారులు చెప్తున్నారు. బేసిన్‌లోని పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు.
ఎస్సారెస్పీ కిందే అనుమానం
కృష్ణాబేసిన్‌తో పోల్చితే ఈసారి గోదావరి బేసిన్లో దయనీయ పరిస్థితి నెలకొన్నది. గోదావరి ఎగువన ఆశించిన వర్షాలు లేక ప్రధాన ప్రాజెక్టులకు ఆశించిన జలాలు రాలేదు. దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, తాలిపేరు, శబరి తదితర నదులు పొంగిపొర్లడంతో గోదావరి ఉధృతంగా ప్రవాహించింది. ప్రాణహిత నుంచే లక్షల క్యూసెక్కుల వరద లక్ష్మీబరాజ్ వద్ద గోదావరిలో కలిసి దిగువకు తరలిపోయింది. ఎస్సారెస్పీ నీటినిల్వ సామర్థ్యం 90టీఎంసీలు కాగా సగం కూడా నిండలేదు. నిజాంసాగర్ పరిస్థితీ దయనీయంగా ఉన్నది. సింగూరులోనూ నీటి నిల్వలు అంతంతే ఉన్నాయి. కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి కొద్ది వరదే వస్తున్నది. దీంతో వాటి ఆయకట్టుకు సాగునీరందించడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరో 15రోజులు చూసి అప్పటికీ వర్షాలు జలాలు రాకుం టే మరోసారి సమీక్షించి వానకాలం ఆయకట్టును ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
వెలవెలబోతున్న చెరువులు..
కొంతకాలంగా వానలు పడుతున్నా రాష్ట్రవ్యాప్తంగా చెరువులు వెలవెలబోతున్నాయి. కుంటలు మినహా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 34,716చెరువులుండగా, 15,149 చెరువుల్లో ఇప్పటికీ 25శాతం కూడా నిల్వలు లేకుండా పోయాయి. 6226 చెరువులు 50-75శాతం, 3415 చెరువులు 75-100శాతమే నిండాయి. 3494చెరువులు మాత్రమే మత్తళ్లు దుంకుతున్నాయి. గజ్వేల్, సంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని చెరువుల పరిస్థితి దారుణంగా ఉన్నది. వాటి పరిధిలోని ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.