హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 27 (నమస్తే తెలంగాణ): మూసీకి ఆకస్మిక వరదలు పేదలను వంచించడానికేనా? ఇది నిజంగా ప్రకృతి విలయమా? లేక వరద పేరుతో పరీవాహక ప్రాంతంలోని పేదలను తరిమివేసే ఎత్తుగడనా? మూసీ నదికి ఆకస్మిక వరదలు.. తదనంతర పరిణామాలు అధికారుల వైఫల్యాన్ని, పాలకుల కుయుక్తిని బయల్పరుస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. గతంలో ఇంతకంటే భారీ వర్షాలు పడిన సందర్భాల్లోనూ చూడని జల విలయాన్ని ఇప్పుడు నగరంలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అనుభవించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. వారం రోజులుగా నిత్యం జంటనగరాలతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల నీటి విడుదలలో అధికారులు ప్రోటోకాల్‌కు భిన్నంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడైనా జంట జలాశయాల గేట్లు ఎత్తే ముందు వివిధ శాఖల అధికార యంత్రాంగం చేపట్టే జాగ్రత్త చర్యలు శుక్రవారం కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
సాధారణంగా గేట్లు ఎత్తే ముందు జలమండలి అధికారులు రెవిన్యూ శాఖకు సమాచారమిస్తే.. ఆ వెంటనే జిల్లా కలెక్టర్ల ఆదేశానుసారం పరివాహక ప్రాంతంలోని ఆర్డీవో, తహసీల్దార్‌తోపాటు ఇతర అధికార యంత్రాంగం తమ పరిధుల్లోని క్షేత్రస్థాయికి వెళ్లి పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి ఖాళీ చేయిస్తారు. కానీ శుక్రవారం సాయంత్రందాకా పరివాహకంలోని బస్తీలు, ఇతర ప్రాంతాలకు ఎలాంటి సమాచారం లేకపోగా.. కనీసం ఆ వైపు అధికారులు తొంగిచూడలేదు. కానీ రాత్రి ఒక్కసారిగా పరివాహకం జలదిగ్బంధం అయ్యాక.. అధికారులు హడావిడిగా రంగంలోకి దిగి తరలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం వరకు సహాయక చర్యల్ని నామమాత్రంగా చేపట్టిన యంత్రాంగం మూసీ ఉగ్రరూపాన్ని ప్రపంచానికి చూపేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో అధికారికంగా నమోదైన వర్షపాతం, జంట జలాశయాల ఇన్‌ఫ్లో-అవుట్‌ఫ్లో వివరాలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు!
మూసీ ఎగువ ప్రాంతాల్లో వరుసగా కుండపోత వర్షాలు లేనప్పటికీ గతంలో చవిచూడని కష్టాలను పరివాహక ప్రాంతంలోని బస్తీవాసులు అనుభవిస్తున్నారు. గతంలో 2020 సంవత్సరంలో 32 సెంటిమీటర్ల వర్షపాతానికి సైతం విలవిలలాడని ప్రాంతాలు ఇప్పుడు 9-13 సెంటీమీటర్ల వర్షపాతానికే అతలాకుతలమయ్యాయి. చారిత్రక ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ సైతం గతంలో ఎన్నడూలేని విధంగా జల దిగ్బంధనంలోకి పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ విలయం వెనక ఏం జరిగిందనే చర్చ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. వికారాబాద్ జిల్లాల్లోని అనంతగిరి కొండల్లో మూసీ, ఈసా నదులు ప్రారంభమవుతాయి.
ఆపై వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల పరిధిలో ఉన్న పూడూరు, కులకచర్ల యాలాల, బషీరాబాద్, ధరూర్, మర్పల్లి, నవాబ్‌పేట, పెద్దేముల్, బంట్వారం, కోట్‌పల్లి, బొంరాస్‌పేట, వికారాబాద్, దౌల్తాబాద్, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, గండిపేట తదితర పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షంతో వరదనీరు మూసీలో కలిసి నగర శివారులో ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు చేరుకుంటాయి. ఈ క్రమంలో జన్మస్థానం నుంచి జంట జలాశయాలకు సమీపంలోని పరివాహక ప్రాంతం వరకు పరిశీలిస్తే.. వరద జలాశయాలను చేరేందుకు 12-24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
గండిపేట ఇలా…
హిమాయత్‌సాగర్ ఇలా…
పొంతన కుదరని ఇన్‌ఫ్లో వివరాలు
ఎప్పటికప్పుడు వివరాలు విడుదల చేస్తున్న జలమండలి
సాధారణంగా జంట జలాశయాలకు భారీ వరద వచ్చిన ప్రతిసారీ ఇన్‌ఫ్లో, అవుట్ఫ్లోతోపాటు అధికారులు ఎన్ని గేట్లు, ఎంతమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారో సమాచారాన్ని బహిర్గతం చేస్తారు. ఈ మేరకు ఈ నెల 14న జంట జలాశయాల నీటి విడుదల వివరాలు వెల్లడించిన జలమండలి ఆపై శుక్రవారం మాత్రమే మళ్లీ ఆ వివరాలను వెల్లడించింది. అంటే ఆ మధ్యకాలంలో నీటి విడుదల జరగలేదని స్పష్టమవుతుంది. దీనినిబట్టి వచ్చిన కొద్దిపాటి వరదను జలాశయాల్లోనే నిల్వ చేశారన్నమాట.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పది గంటల వరకు తొలిసారిగా జలమండలి జంట జలాశయా ల నుంచి నీటిని విడుదల చేసినట్టు ప్రకటించిందంటే అంతకు 12-24 గంటల ముందు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని అర్థం. ఈ వర్షాలపై అధికారులకు ముందుగానే సమాచారం ఉంది. ప్రస్తుతం అధికారులు చెప్తున్నట్టు ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగినందునే భారీ మొత్తంలో మూసీలోకి నీటిని వదిలామనేది పొంతనలేని వాదన. పైనుంచి వచ్చే వరద అంచనాలను బట్టి జలాశయాల్లో నీటిమట్టాన్ని నిర్వహించాలి. ఇందుకు అధికారుల వద్ద ఆపరేషన్ ప్రొటోకాల్ ఉంటుంది. అయినా ఒక్కసారిగా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసీలోకి భారీ వరదను వదలడంలో ఆంతర్యమేందో అధికారులకే తెలియాలి.
ముందుగానే అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ
కొంతకాలంగా క్లౌడ్ బరస్ట్‌లతో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సామాన్యులు సైతం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని గమనిస్తున్నారు. వాతావరణశాఖ కూడా ప్రకటనల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించింది. అంటే జలమండలి అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. కానీ ఇన్‌ఫ్లోను అం చనా వేసి అవుట్‌ఫ్లోను ఎందుకు పెంచలేదన్నది ఇక్కడ కీలకమైన సందేహం.