రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రామగుండం 3 ఏరియా ఓసీపీ 2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం భూసేకరణ పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. ఎలాంటి నోటీసులు జారీచేయకుండానే ఇండ్లను కూల్చివేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొద్దిరోజుల క్రితమే బుధవారంపేటలో ఉన్న పాత నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయించిన అధికారులు, కొత్తగా వెలిసిన ఇండ్లకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలిచ్చారు. బుధవారంపేట గ్రామాన్ని పూర్తిగా సింగరేణి సేకరించాలని, లేదంటే పనులను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరించినా కొద్ది రోజులుగా ఆ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రామగిరి పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్, రెవెన్యూ, సింగరేణి అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలనే నెపంతో బుధవారంపేటలోని పలువురు బాధితుల ఇండ్లను కూల్చివేశారు.
‘అయితే ఈ కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఆ ఇండ్ల వద్ద ఎవరులేని సమయంలోనే అధికారులు యంత్రాలతో ఇళ్లను నేలమట్టం చేశారని బాధితులు వాపోయారు. దాంతో ఆగ్రహించిన బుధవారంపేట గ్రామస్తులు మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. సొంత పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకుంటే ఎలా అక్రమమవుతాయి? నోటీసులు లేకుండా కూల్చివేతకు ఎవరు అనుమతి ఇచ్చారు?’ అంటూ బాధితులు అధికారులను ప్రశ్నించారు.
‘జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడే ఉండి కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తూ, కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు.
ధర్నా కారణంగా మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న గోదావరిఖని వన్, టూ టౌన్ సీఐలు, ఎస్సైలు శ్రీనివాస్, దివ్యతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపారు.
అయినప్పటికీ బాధితులు తమ ఆందోళనను విరమించేందుకు ససేమిరా అన్నారు.
తదనంతరం గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను శాంతింపజేస్తూ సానుకూలంగా చర్చలు జరిపారు. తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. అయితే నోటీసులు లేకుండా, బాధితులకు సమాచారం ఇవ్వకుండా జరిగిన కూల్చివేతపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.