మంచిర్యాల, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా కేంద్రం లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి అధికారిక పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు (పీఎస్సా ర్) తెరలేపారు. మాతా, శిశు హాస్పిటల్ ఏర్పాటు పేరిట జిల్లా కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను గురువారం నుంచి కూల్చివేయిస్తున్నారు (ఇంకా కొనసాగుతున్నది). గత ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండాలన్న ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకోసం రూ.7.20 కోట్లు కేటాయించి, దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే పనులను కూడా పూర్తి చేసింది. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ భవనాన్ని అర్ధాంతరంగా కూలుస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉన్న రెండెకరాల ఆరు గుంటల భూమితోపాటు దాని వెనక ఉన్న ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, ఆర్డీవో కార్యాలయం ఉన్న భవనం సహా వాటర్ ట్యాంక్ మొత్తం 4.22 ఎకరాలు ఇప్పుడు నూతన హాస్పిటల్ నిర్మాణానికి ఇచ్చారు. దీంతో ఈ రోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కూలుస్తుండగా.. త్వరలో రూ.3 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ (ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయానికి కేటాయించారు), రూ.3 కోట్లు విలువ చేసే పాత ఆర్అండ్బీ ఆఫీస్ భవనాలను కూడా కూల్చనున్నట్టు తెలిసింది. హాస్పిటల్ నిర్మాణం పేరిట దాదాపు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కూలుస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
4.22 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మించాలంటే మున్సిపాలిటీ సహా ఆర్అండ్బీ శాఖలు ఆ భూమిని టీఎస్ఎంఐడీసీ (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కు అప్పగించాలి. ఈ మేరకు మున్సిపాలిటీ, ఆర్అండ్బీ శాఖలు ఆ భూమిని టీఎస్ఎండీసీకి ఇస్తున్నట్టు లేఖలు అందజేశాయి. కానీ.. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సర్కారు ఆర్డర్ రాలేదని, ఎలాంటి ఆదేశాలు రాకముందే ఇలా కూల్చివేతలు చేస్తున్నారని టీఎస్ఎండీసీకి అనుసంధానంగా పని చేసే జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఇలా ఏ ఆర్డర్ లేకుండా ఎలా కూల్చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. అసలు ఆ అధికారం వీరికి ఎవరిచ్చారు? అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేస్తుండటంపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్‌ను వివరణ కోరగా.. కూల్చివేతల విషయం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లే చూసుకుంటున్నారని చెప్పారు. తమకు ఈ విషయంలో సంబంధం లేదని, కూల్చివేత పర్మిషన్లు కూడా వాళ్లే తీసుకుంటారని స్పష్టంచేశారు. ఇదే విషయమై ఆర్అండ్బీ డీఈ రమేశ్‌ను వివరణ కోరగా.. స్థలాన్ని టీఎస్ఎండీసీకి అప్పగించామని, కూల్చివేతపై తమకు ఎలాంటి నోటీసు రాలేదని, అది పూర్తిగా మెడికల్ అండ్ హెల్త్ అధికారులే చూసుకుంటున్నారని చెప్పారు. తమ కార్యాలయాలు ఖాళీ చేసేందుకు 15 రోజుల సమయం ఇచ్చారని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం అధికారికంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొంటున్నారు. ఇలా ఏ శాఖ అధికారిని అడిగినా ఎవరికి వారు కూల్చివేతపై తప్పించుకునే సమాధానాలు చెప్పడం గమనార్హం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కూల్చడానికి ముందు మంచిర్యాల మార్కెట్‌రోడ్డులో సెట్‌బ్యాక్ లేకుండా ఉన్న నిర్మాణాలను కూడా మున్సిపల్ అధికారులు కూల్చారు. దీంతో కూల్చివేతలపై స్థానికులు మండిపడుతున్నారు.
ప్రజలకు సుస్థిరమైన పాలన అందించడంలో ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మంచి పనులన్నీ ఆగిపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మంచిర్యాల ప్రజల కోసం తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ మొండి గోడలతో కనపడుతున్నది. ప్రజలకు ఉపయోగపడే ఈ బిల్డింగ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపేసింది. ఏ కారణంతో ఆపేసిందో చెప్పాలె.