Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో ట్రేడ్ లైసెన్స్ లేదని ఓ టీ షాప్ను మూసేయాలని మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ షరతులు అందరికా? కొందరికేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ‘మీ బిల్లు మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్లు ఎక్స్ట్రా’ డైలాగ్తో యూట్యూబ్లో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు ప్రజలు క్యూ కట్టారు. హైదరాబాద్లో ఆమె స్టాల్కు తండోపతండాలుగా వస్తున్న భోజన ప్రియులతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఫుడ్ స్టాల్ను అక్కడి నుంచి తీసేయాలని నోటీసులు జారీ చేశారు.
ఆమెకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున రావడంతో సీఎం రేవంత్ స్పందించి బాసటగా నిలిచారు. ఫుడ్స్టాల్ను అక్కడి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను, కేసుపై పు నరాలోచించాలని డీజీపీని ఆదేశించారు. సీఎం రేవంత్ తనకు అండగా నిలిచినందుకు అభిమానంతో ఆయన ఫొటోను దేవుళ్ల వద్ద పెట్టి కుమారి ఆంటీ పూజలు చేస్తున్న వీడియో కూడా బుధవారం వైరల్ అయింది.
అభిమానంతో తమకు ఇష్టమైన నేతల ఫొటోలను షాపులు వద్ద పెట్టుకోవడం సహజమని, అలాంటిది కేటీఆర్ ఫొటో ఉన్నదన్న కారణం గా సిరిసిల్లలో చిన్నపాటి టీ స్టాల్ను తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో చిన్నపాటి షాపులు ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్నాయని, ఒక్క సిరిసిల్లలోని టీస్టాల్కే ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ గుర్తొచ్చిందా అని నిలదీస్తున్నారు. ద్వంద్వ వైఖరిని మార్చుకోవాలని, స్వార్థరాజకీయాలకు సామాన్యులను బలిచేయొద్దని హితవుపలుకుతున్నారు.