Yenkepally | మొయినాబాద్, జూలై 8 : దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్న భూమిని, ఇప్పుడు ప్రభుత్వం గుంజుకోకుండా రక్షించుకునేందుకు రైతులు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. ఆదమరిచి కునుకు వేసినా.. అధికారులు ఎక్కడ కంచె వేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లిలో ప్రస్తుతం పరిస్థితి ఇది. ఎనికెపల్లిలోని 180 సర్వే నంబర్లో ఉన్న 99.14 ఎకరాల అసైన్డ్ భూమిని గ్రామానికి చెందిన 50 కుటుంబాలు ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాయి. వారు జీవనాధారం పొందడంతోపాటు ఆ భూములను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ భూములను గోశాలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై ప్రభుత్వం ఇప్పటివరకు తేల్చలేదు. దీంతో రైతులు భూములను వదిలేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేతుల మీదుగా సోమవారం గోశాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. భూమి పూజను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. భూమి చుట్టూ కంచె వేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసుల పహారా కొనసాగిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వం పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రయోగించి అయినా సరై భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో అయినా అధికారులు కంచె వేస్తారనే భయంతో రైతులు భూముల వద్దే రాత్రి పగలు కాపలాగా ఉంటున్నారు. కొందరు పొలం వద్దే వంటలు చేసుకుంటుండగా, మరికొందరు ఆకలికి ఓర్చుకుంటూ, రాత్రి చలి మంటలు వేసుకుంటూ కావలి కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామ మాత్రం పరిహారాన్ని సహించేది లేదని, న్యాయబద్ధంగా పరిహారం ఇచ్చే వరకు వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరాకు 300 గజాలు ఇస్తామని చెప్తున్నదని, ఇది సరికాదన్నారు. సోమవారం చర్చలకు రావాలని పిలిచారని, కానీ చర్చలు జరుపకుండానే ఎమ్మెల్యే నేరుగా పొలం వద్దకు వెళ్లి భూమి పూజచేశారని మండిపడుతున్నారు. దీంతో తాము ఆదమరిచి నిద్రపోయినా అధికారులు భూములను గుంజకుంటారేమో అని ఆందోళన చెందుతున్నామన్నారు. ఎకరానికి 500 గజాలు ఇస్తే గోశాలకు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు.
గోశాలకు ప్రతిపాదించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ అధికారులు మంగళవారం కూల్చివేతలు నిర్వహించారు. ఎనికేపల్లి నుంచి అండాపూర్కు వెళ్లే అర్అండ్బీ రోడ్‌కు ఆనుకొని ఉన్న అసైన్డ్ భూముల్లోని నిర్మాణాలను తాసిల్దార్ గౌతమ్‌కుమార్ నేతృత్వంలో కూల్చివేశారు. రోడ్డువైపు ఉన్న నిర్మాణాలను, దాని వెనుక ఉన్న ప్రహరీని కూల్చేశారు. వెంచర్లో హద్దు రాళ్లను తొలిగించారు. కూల్చివేతలు ఆపాలని ప్రభుత్వ పెద్దల నుంచి జిల్లా అధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, కానీ పట్టించుకోలేదని మండల అధికారులు తెలిపారు. ప్రభు త్వం ఆక్రమణలను తొలిగించినట్టే చెప్తు న్నా, రైతుల్లో మాత్రం ఆందోళన పెరిగింది. ఆక్రమణల పేరుతో తమను వెళ్లగొట్టి భూములను గుంజుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెల్లార్లూ కా పలా ఉంటున్నట్టు తెలిపారు. ప్రభు త్వం ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. అప్పటివరకు ఆం దోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
మక్తల్, జూలై 8: నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి భూములు ఇవ్వాల్సిందేనని ఆర్డీవో రామచందర్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఎర్నాగన్పల్లి రైతులతో తన చాంబర్లో ఆర్డీవో రామచందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇస్తేనే భూములిస్తామని రైతులు స్పష్టంచేయగా.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని, అంతకంటే ఎక్కువ అందించేది లేదని ఆర్డీవో చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని, ప్రాజెక్టుతో సర్వస్వం కోల్పోతున్నందున తగిన పరిహారం ఇవ్వాలని మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి రైతులు గోడు వెల్లబోసుకున్నారు.