Telangana CMO | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయంలో ఇద్దరు అతి కీలక అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్ ఐఏఎస్‌లు ఇబ్బంది పడుతున్నారా? ఒక అధికారిణి తనకు ఇష్టం లేని అధికారులు పంపిస్తున్న ఫైళ్ల మీద ‘డిస్కషన్’ అని రాసి వేధిస్తున్నారా? సీఎంవోలోని మరో కీలక అధికారేమో నోట్‌ఫైల్ పెడితేనే ఫైల్ చూస్తా అంటున్నారా? వీరిద్దరి ప్రవర్తనతో ఫైళ్లు ముందుకు కదలడం లేదా? సచివాలయంలో ఉద్యోగులందరూ ఇవే అంశాల మీద చర్చించుకుంటున్నారు. పరిపాలనకు కేంద్రబిందువైన సచివాలయంలో ప్రస్తుతం ఒక రకమైన నిర్లిప్త వాతావరణం కనిపిస్తున్నది. కీలక అధికారిణికీ, కొందరు సీనియర్ ఐఏఎస్‌లకు పడటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, సీఎంవోలో కూడా ఒక ముఖ్యమైన అధికారి తీరు విచిత్రంగా ఉన్నదని, రొటీన్ ఫైళ్లకు కూడా నోట్‌ఫైల్, విత్ సిగ్నేచర్‌తో రమ్మంటున్నారని అధికారులు తలలు పట్టకుంటున్నారు. సదరు అధికారి తీరుపై చాలామంది ఐఏఎస్‌లు ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. చిన్నచిన్న అంశాలు, సాధారణ, పరిపాలనా విషయాల్లోనూ వారి జోక్యం పెరిగిపోయిందని ఐఏఎస్‌లు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ప్రధానంగా ఆ ఇద్దరూ వారికి ఇష్టం లేని ఐఏఎస్‌ల పట్ల దురుసు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయా బ్యూరోక్లాట్లకు సంబంధించిన ఫైళ్లు సదరు అధికారిణి వద్దకు వెళ్తే.. వెనుకా ముందు చూడకుండా ‘డిస్కర్షన్’ అని రాస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. ఫైల్‌పై ‘డిస్కర్షన్’ కోసం వెళ్లిన అధికారులకు సమయం ఇవ్వకుండా గంటల తరబడి నిరీక్షింప చేస్తున్నారని, కొందరు అధికారులైతే రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తున్నదని చెప్పుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఇద్దరు సీనియర్ అధికారులు ఫైళ్లు పట్టుకొని సదరు అధికారిణి కోసం రెండు రోజులు నిరీక్షించాల్సి వచ్చిందని సచివాలయంలో చర్చించుకుంటున్నా రు.
ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్‌లను టార్గెట్ చేస్తూ వారిని ఇప్పటికే అప్రధాన పోస్టుల్లోకి పంపించారని, అయినా ఇంకా వారిపట్ల కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంవోలోని మరో అధికారి తీసుకుంటున్న ‘అతి జాగ్రత్తలు’ కారణంగా అధికారులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. సీఎంవోకు ఎటువంటి ఫైల్ పంపినా.. సదరు ఫైల్‌కు సంబంధించిన నోట్ఫైల్తోపాటు దాని మీద, అధికారి సంతకం కూడా ఉండాలని మౌఖి క ఆదేశాలు ఇస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అదంతా పాలకులు మారి, భవిష్యత్‌లో ఆయా ఫైళ్ల మీద ఏమైనా నవిచారణ లాంటివి జరిగితే తన మీద కు రాకుండా ఉండేందుకే ముందు జాగ్రత్తగా అధికారులను ఇరికించే ప్ర యత్నమేనని సచివాలయంలో చర్చించుకుంటున్నారు. రొటీన్‌గా వెళ్లే ఫైళ్లకు సైతం నోట్‌ఫైల్ కావాలని పట్టుబడుతున్నారని, దీంతో ఫైళ్లు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లకుండా వందల కొద్ది పెండింగ్‌లో ఉంటున్నాయని సచివాలయ అధికారులు ఆందోళన చెందుతున్నారు.