Agriculture Department | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఓ అధికారి 17 ఏండ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిసున్నారు. ఇదే ఆఫీసులో మరో అధికారి 15 ఏండ్లుగా, ఇంకో అధికారి 12 ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల్లో ఏవో క్యాడర్ అధికారులను పరిశీలిస్తే.. సుమారు 14 ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులు ముగ్గురు ఉండగా, 10 ఏండ్లకు పైగా పనిచేస్తున్నవారు 60 మందికిపైగా ఉన్నారు. ఈ విధంగా ఒకేచోట ఏండ్లకు ఏండ్లు తిష్టవేసిన అధికారుల జాబితా చాంతాడంత పెద్దగా ఉన్నది. ఇటు కమిషనరేట్‌లో, అటు జిల్లా ఆఫీసుల్లో వందల సంఖ్యలో అధికారులు ఒకేచోట ఏండ్లుగా పాతుకుపోయారు. అక్కడి నుంచి కదిలేందుకు, ఆ పీఠాన్ని వదిలేందుకు ససేమిరా అంటున్నారు.
నో ఫీల్డ్ వర్క్.. ఓన్లీ హైదరాబాద్
వ్యవసాయ శాఖలో క్యాడర్ ఏదైనా ప్రతి అధికారి కచ్చితంగా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఉన్న కొందరు అధికారులు జిల్లా స్థాయిలో పనిచేసి ఇక్కడికి వచ్చినవారే. ఇందుకు భిన్నంగా అదే ఆఫీసులో కొంతమంది అధికారులు ‘కాలికి మట్టి అంటకుండా’ ఉద్యోగం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ల సర్వీస్ మొత్తం హైదరాబాద్‌లోనే ఉన్నట్టు తెలిసింది. ఏదైనా కారణాలతో బదిలీ చేస్తే పైరవీలు, పలుకుబడితో హైదరాబాద్‌లోని వ్యవసాయ అనుబంధ విభాగాల్లోనో, డిప్యుటేషన్‌తో ఇతర శాఖల్లోకి వెళ్తున్నారు తప్ప.. హైదరాబాద్‌ను మాత్రం విడవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫీల్డ్ వర్క్ అనుభవం లేకుండానే హెడ్ ఆఫీసులో కూర్చొని ‘పెత్తనం’ చేస్తున్నారని ఆ శాఖ అధికారులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీరి వల్ల అర్హత ఉన్న క్షేత్రస్థాయి అధికారులు హైదరాబాద్‌కు రాలేకపోతున్నారు. ఓ ఏడీఏ 25 ఏండ్లుగా వ్యవసాయశాఖలో పని చేస్తున్నారు. ఆయన సర్వీస్ మొత్తం జిల్లాల్లోనే చేశారు. ఇప్పుడు కూడా జిల్లాలోనే చేస్తున్నారు. ఆ అధికారి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నా, ఇక్కడున్న అధికారులు ఆ కుర్చీలను వదలకపోవటంతో ఆయనకు అవకాశం దక్కటం లేదు. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’తో చెప్పి వాపోయారు. ‘వాళ్లే తోపులా? మేం పని చేయలేమా? అయినా ఏండ్లుగా వాళ్లే ఉంటే మాలాంటి వాళ్లు పని నేర్చుకునేదెప్పుడు? మేం బానిసల్లా జిల్లాల్లో పని చేయాలి. వాళ్లేమో రాజుల్లాగా హెడ్ ఆఫీసులో కూర్చొని పెత్తనం చెలాయిస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి అధికారులను ఈ బదిలీల్లో కచ్చితంగా హైదరాబాద్ దాటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ బదిలీలకు అర్థం లేని స్పష్టం చేశారు. పలువురు అధికారులు కూడా సంఘాల పేరుతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏఈవో సంఘం నుంచి హెడ్ ఆఫీసు సంఘాల వరకు అందరూ గతంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావాల్సిన వారిని కావాల్సిన స్థానాల్లో కూర్చోబెట్టారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో రెండు సంఘాల మధ్య వైరుద్యం బహిరంగమే. దీంతో ఎవరికి వారు తమ ప్రాభవాన్ని, బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా ఆ పీఠాలు కదిలేనా?
ప్రస్తుతం వ్యవసాయ శాఖలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నది. ఇందుకోసం బదిలీ కావాల్సిన అధికారుల జాబితాను రూపొందించారు. ఇందులో ఏండ్లుగా ఒకేచోట ఉన్నవారికి తప్పనిసరి(కంపల్సరీ)గా బదిలీ కింద చూపించగా మరికొందరికి తప్పనిసరి కాదు(నాట్ కంపల్సరీ)గా పేర్కొన్నారు. అయితే ఈ జాబితా ప్రకారం బదిలీలు జరుగుతాయా లేదా అనుమానాలు వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జాబితా ప్రకారం చేస్తే కమిషనరేట్‌లో ఏండ్లుగా పాతుకుపోయిన చాలా మంది అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉన్నది.