Governor Jishnu Dev Varma | జనగామ/యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సందర్శించిన తొలి గ్రామమైన జనగామ జిల్లా ఓబుల్ కేశ్వాపూర్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని టూరిజం దైవక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన.. గురువారం జనగామ జిల్లా పర్యటనను ముగించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాకు రోడ్డు మార్గంలో వెళ్లారు.
తొలుత ఉదయం వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జనగామ సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రముఖ కవులు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర పురసార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహించారు. తర్వాత గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్వగ్రామం జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ను సందర్శించిన గవర్నర్‌కు కళాకారులు బోనాలు, కోలాటాలతో స్వాగతం పలికారు.
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వేదపండితులు స్వామికి అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో గవర్నర్ పూల మొకను నాటారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చిన గవర్నర్‌కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే జండగే, డీసీపీ రాజేశ్చంద్ర స్వాగతం పలికారు.
ముందుగా ఆలేరు మండలంలోని కొలనుపాక జైన మందిరం, సోమేశ్వరాలయాన్ని గవర్నర్ సందర్శించారు. అనంతరం భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భువనగిరి కలెక్టరేట్లో రచయితలు, కళాకారులు, వివిధ రంగాల అవార్డు గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొన్నారు.