యాదాద్రి భువనగిరి, మే 20 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో నిధులు స్వాహా అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భువనగిరి మున్సిపాలిటీలో 1,200 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మెప్మా ద్వారా వీరు రు ణాలు తీసుకొని.. తిరిగి చెల్లిస్తారు. దీనికోసం బ్యాంక్లో మైక్రో క్రెడిట్ పాలసీ(ఎంసీపీ)ని అమలు చేయాలి. భువనగిరిలో కెనరా బ్యాంక్ అధికారులు మున్సిపల్ కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత ఎంసీపీ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా రుణాలు ఇచ్చారు. సంఘం సభ్యుడి ఖాతాల్లో కాకుండా సంఘం ఖాతాల్లో డబ్బు లు జమ కావడంతో దుర్వినియోగం మరింత సులువైంది. సరైన డాక్యుమెంట్లు, సంతకాలు, వ్యక్తులు లేకున్నా బ్యాంక్లు అప్రూవ్ చేశాయి.
సంఘాల్లో సభ్యులు లేకున్నా.. గ్రూపుల్లో లేని వ్యక్తుల ఆధార్ కార్డులతో రుణాలు తీసుకున్నారు. ఒకేవ్యక్తి ఆధార్ కార్డును రెండు, మూడుసార్లు జత చేశారు. పది రోజుల్లో ఏర్పాటైన సంఘాలకు కూడా లోన్లు ఇచ్చారు. భువనగిరి మున్సిపాలిటీలో 38 సంఘాలు ఉండగా, 2023 నుంచి ఇప్పటివరకు రూ. 6,26,53,383 నిధులు దుర్వినియోగం అయ్యాయి. వీటిని ఆర్పీలు సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్పీలు బిందు రూ. 2.30 కోట్లు, దివ్య రూ. 3.54 కోట్లు, సిరియాల రూ. 27లక్షలు, స్వరాజ్యలక్ష్మి రూ.15లక్షల చొప్పున స్వాహా చేశారు. మొత్తం 1.5 కోట్లు మాత్రమే చెల్లించడం కొసమెరుపు.
బయటపడింది ఇలా..
మున్సిపాలిటీలో రుణాలు తీసుకోకున్నా కొందరికి ఇటీవల బ్యాంక్ నుంచి నోటీసులు అందాయి. దీంతో అవాక్కయిన సభ్యులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తాము అసలు డబ్బులే తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది. ఇదే విషయంలో నలుగురు ఆర్పీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపాలిటీలో అధికారులు ఆడిటింగ్ చేయగా అవకతవకలు పాల్పడ్డారనే విషయం తేలడంతో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. దీంతో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఆర్పీలతోపాటు బ్యాంక్ సిబ్బంది, మెప్మా అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.