హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మేడారం గద్దెల స్తంభాలపై ఏర్పాటు చేసిన చిహ్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆదివాసీ సంప్రదాయాలకు నెలవైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కోయల జీవిత చరిత్రను చాటిచెప్పే చిహ్నా ల్లో ఆధునిక, బ్రాహ్మణీయ భావజాలాన్ని జొ ప్పించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న కథనాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. చిహ్నాల విషయంలో ఆదివాసీ పరిశోధకులు, చరిత్రకారులు చెప్పిన విషయాలపై భక్తులు ఆలోచిస్తున్నారు. తాళపత్ర గ్రంథాలు దొరికాయని చెప్తున్నవాళ్లు.. వాటిని బయటపెట్టాలని ఆదివాసీ పరిశోధకులు డిమాండ్ చేస్తున్నారు.
చరిత్రను తప్పుదోవ పట్టించే విధంగా పటాలను పెయింట్లుగా వేసి, వాటిపై నామాలు, శంఖచక్రాలు పెట్టడం సరికాదని చెప్తున్నారు. వందల ఏండ్ల నుంచి కోయ వంశాలు, గొట్లు గోత్రాల చరిత్రను తెలిపే డాలుపటాల తయారీ విధానమే వేరుగా ఉంటుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా డాలుపటాల్లో ఎనభై వరకు బొమ్మ లు ఉంటాయని, ఇవన్నీ ఆయా గొట్లు గోత్రాల చరిత్రను తెలుపుతాయని అంటున్నారు. కానీ మేడారంలో స్తంభాలపై చిహ్నాలు సరైన విధంగా లేవని ఆదివాసీ పరిశోధకులు, జాతరపై లోతైన అధ్యయనం చేసినవారు చెప్తున్నారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీల చరిత్రను మరుగున పడేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం డాలుపటం త యారీదారులు, వడ్డెరలు, అర్తిదారులు, డోలివాయిద్యకారులతో చర్చించి, చిత్రాలు రూ పొందించాలని డిమాండ్ చేస్తున్నారు.

దేవాదాయశాఖ పాత్ర నామమాత్రం!
మేడారం జాతర నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోనే జరుగుతుంది. కానీ గద్దెల ప్రాంగణంలో పనులపై ఆ శాఖ జోక్యమే ఉం డదని అధికారులు చెప్తున్నారు. మేడారం విషయంలో గతంలో గద్దెల వద్ద శాలహారం నిర్మించేటప్పుడు ఆదివాసీలు అడ్డుకోవడంతో దేవాదాయశాఖ నిర్మాణాలు చేపట్టలేదు. అప్పటినుంచి కేవలం గద్దెల వద్ద ఆదివాసీ పూజారులు సూచించిన మేరకే పనులు చేస్తున్నామని దేవాదాయ అధికారులు చెప్పారు. మరి స్తంభాల ఏర్పాటు, చిహ్నాలు చెక్కడంలో ఎవరు జోక్యం చేసుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. తమను ఎవరూ సంప్రదించలేదని, శాఖలో ఎవరికి వారే పనిచేస్తున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మేడారంపై సమీక్షల్లో కూడా సంబంధితశాఖ మంత్రి సురేఖ పాల్గొన లేదని తెలిపారు. మేడారం విషయంలో ఆమె జోక్యాన్ని కొం దరు పెద్దలు ఒప్పుకోవడం లేదని చర్చ జరుగుతున్నది. దేవాదాయశాఖ మంత్రికి సంబంధం లేకపోతే, ఇష్టారీతిన పనులు ఎవరు సాగిస్తున్నారో అనే అనుమానం కలుగుతున్నది.