హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ల్యాబ్ టెక్నీషియన్లు చేయాల్సిన పనిని తమతో చేయిస్తున్నారంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ టెస్టుల కోసం రోగుల నుంచి రక్త, మూత్ర న మూనాల సేకరణ, ల్యాబ్‌లో అప్పగింత, రిపోర్టులను తీసుకొచ్చే బాధ్యత కూడా తమపైనే వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ఇటీవలే సర్యులర్ కూడా జారీ చేశారు.
అన్ని దవాఖానల్లో ఇదే పరిస్థితి ఉన్నదని నర్సులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం ఈ ప నులు ల్యాబ్ టెక్నీషియన్లు చేయాల్సి ఉంటుంది. స్టాం డింగ్ ఆర్డర్స్లోనూ స్పష్టంగా పేర్కొన్నారు. సరైన పద్ధతిలో శాంపిళ్ల సేకరణ, రవాణా, పరీక్షలు జరగాలంటే ల్యాబ్ టెక్నీషియన్లే చేయాల్సి ఉంటుందని నర్సులు చెబుతున్నారు. సరైన శిక్షణ లేని తమతో ఆ పనిచేయి స్తే, ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నిస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం ప్రతి 45 మంది పేషెంట్లకు ఒక నర్సు ఉండాలి.
కానీ మా వార్డులో 73 మంది ఇన్ పేషెంట్లు ఉంటే.. నేను ఒక్కదాన్నే ఉన్నాను’ అని ములుగు జిల్లాకు చెందిన ఓ నర్సు వాపోయారు. దీంతో పేషెంట్ కేర్‌పై ప్రభావం పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫార్మసీ విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ బాధ్యతలు కూడా అప్పగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమపై పనిభారం తగ్గించాలని కోరుతున్నారు.