మక్తల్, మార్చి 22: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల సంక్షేమాన్ని చూసుకుంటూ.. తమకు నచ్చిన విధంగా బడ్జెట్ రూపొందించుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో మీడియాతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా ఎందుకు ప్రభుత్వంలో పెట్టుకున్నారని ప్రశ్నించారు. వ్యవసాయానికి బడ్జెట్లో సగానికి పైగా కత్తరించేశారని ఆరోపించారు. రైతుభరోసా ఎకరాకు రూ.12 వేలు ఎకడికి పోయాయని నిలదీశారు. రెండు దఫాలుగా రైతు భరోసా నిధులు జమ చేయలేదని ఆరోపించారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కమీషన్ల కోసమే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని చెప్పారు.
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నప్పటికీ సీఎం మక్తల్-నారాయణపేట రోడ్డును రూ.210 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డుగా మారుస్తామని శంకుస్థాపన చేసి.. మూడు నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు పనులు ప్రారంభించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వాకిటి శ్రీహరికి తన అభివృద్ధికి సమయం కేటాయిస్తున్నారు తప్ప.. నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రద్ధ చూపడంలేదని ధ్వజమెత్తారు. మత్స్యశాఖకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎకడెకడ ఖర్చు చేస్తారో బహిర్గతం చేయాలని డిమాండ్చేశారు.