Low Pressure | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏటా ఏర్పడే అల్పపీడనాల సంఖ్య పెరుగుతున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడ్డాయని తెలిపారు. అల్పపీడనాల గమనం కూడా అసాధారణంగా ఉంటున్నదని చెప్పారు. గతంలో తుపాను అంటే భయపడే ప్రజానీకం ఇప్పుడు అల్పపీడనం అంటే కూడా ఆందోళన చెందాల్సి వస్తున్నదని తెలిపారు.
సాధారణంగా అల్పపీడనాలు అక్టోబర్, నవంబర్లో ఒడిశా, ఉత్తర కోస్తా మధ్యలో తీరాన్ని, నవంబరు తర్వాత మచిలీపట్నం, ఒంగోలు వద్ద, డిసెంబరులో తమిళనాడులో తీరం దాటుతాయి. కానీ 2023లో ఏర్పడిన తుపాన్లు అన్నీ గమనం మార్చుకున్నాయని వివరించారు. 1965-2022 మధ్య అల్పపీడనాల గణాంకాలను చూస్తే అరేబియాలో ఏటా సగటున 12 అల్పపీడనాలు ఏర్పితే ఈ సంవత్సరం ఒక్క బంగాళాఖాతంలోనే 14 అల్పపీడనాలు ఏర్పడ్డాయని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో తటస్థంగా ఉన్నదని, హిందూమహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎకువగా నమోదవుతున్నాయని వెల్లడించారు.