బంజారాహిల్స్/సుల్తాన్‌బజార్, ఆగస్టు 1: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి (57) ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 9లో గల తన ఇంట్లో సోమవారం ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకొన్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లిన ఉమామహేశ్వరి మధ్యా హ్నం దాటినా బయటికి రాలేదు.
భోజనం సమయం కావటంతో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పనిమనిషి గది వద్దకు వెళ్లింది. అయితే, గదికి గడియ పెట్టి ఉండటంతో నిద్రపోయి ఉండవచ్చని భావించారు. మరోసారి 1.30 ప్రాంతంలో తల్లిని పిలిచేందుకు చిన్నకూతురు దీక్షిత గది వద్దకు వెళ్లి ఎన్నిసార్లు తలుపు తట్టినా తీయలేదు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో ఈ విషయాన్ని దీక్షిత తన మామ నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసి తెలిపారు.
బాలకృష్ణ, రామకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా లోకేశ్, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, కంభంపాటి రామ్మోహన్ తదితరులు అక్కడికి చేరుకొన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దీక్షిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు భౌతికకాయాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
పోస్టుమార్టం పూర్తయ్యాక ఆమె భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. ఉమామహేశ్వరి, శ్రీనివాసప్రసాద్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు విశాల అమెరికాలో భర్తతో కలిసి ఉంటున్నారు. 3 నెలల క్రితం చిన్న కూ తురు దీక్షిత వివాహం కాగా, ఆదివారం రాత్రి భర్తతో కలిసి తల్లి వద్దకు వచ్చారు. విశాల అమెరికా నుంచి వచ్చాక బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉమామహేశ్వరికి నివాళి అర్పించారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్న తమ తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారని కూతురు దీక్షిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో.. ఉమామహేశ్వరి కొంతకాలంగా యాంటి డిప్రెషన్ మందులు వాడుతున్నట్టు వెల్లడైంది. కాగా, 3 రోజులుగా ఉమామహేశ్వరి భర్త శ్రీనివాసప్రసాద్ ఇంటికి రావటం లేదని తెలిసింది. ఆత్మహత్య గురించి తెలిసి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారని స్థానికులు చెప్తున్నారు. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేక ఇతర కారణం ఉన్నదా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.