హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో జంతుజాలం, పశుపక్ష్యాదులు లేవంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన దారుణ వ్యాఖ్యలను నిర్దందంగా ఖండిస్తున్నట్టు ఎన్ఎస్యూఐ పేర్కొంది. భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులను, పర్యావరణవేత్తలను ‘గుంట నక్కలు’ అన్న సీఎం వ్యాఖ్యలు బాధ్యతారహితం, పర్యావరణ పరిరక్షణపై దాడిగానే భావిస్తాం అని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. పులులు, జింకల వంటి భారీ క్షీరదాలు లేనంత మాత్రాన ఆ భూములను వేలం వేయవచ్చన్న సీఎం వాదన అశాస్త్రీయమని పేర్కొంది. పర్యావరణ పరిరక్షకులను గుంట నక్కలు అని ఎగతాళి చేసి సీఎం తమ నోరు మూయించలేరని తేల్చిచెప్పింది. సీఎం నోటి వెంట ఇవేం వ్యాఖ్యలంటూ మండిపడింది.
ఈ 400 ఎకరాల్లో 734 వృక్ష, 220 పక్షి జాతులు, అనేక సరీసృపాలు, నక్షత్ర తాబేళ్లు, మచ్చల జింకలు, అడవిపందులు, కుందేళ్లు ఉన్నాయని పేర్కొన్నది. పర్యావరణానికి హాని కలిగిస్తే మౌనంగా ఉండలేమని తేల్చిచెప్పింది. గచ్చిబౌలిలో జీవవైవిధ్యాన్ని కాపాడాలనే పోరాటానికి ఎన్ఎస్యూఐ (హెచ్సీయూ) పూర్తి మద్దుతు తెలుపుతుందని స్పష్టంచేసింది. ఈ భూముల వేలం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.