ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్టు మింగేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేటు భూములపై కన్నేశారు. ఖాళీ జాగ కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లతో పాగా వేస్తున్నారు.
మంత్రులు, వారి పేషీలు వెనుక ఉండి నడిపి స్తుండటంతో అధికారులు సైతం కబ్జారాయుళ్లకు అండగా నిలుస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళా ఎన్నారై రెండెకరాల భూమి పరిస్థితి ఇదే.
ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జా రాయుళ్లకు సహకరిం చాలని ఆదేశించడంతో బాధితురాలు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత భూమిని కాపాడుకు నేందుకు తిప్పలు పడుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 385లో ఎకరం భూమిని 1999లో జమ్మల నగేశ్ అనే వ్యక్తి రజితారెడ్డి, రేఖారెడ్డి కుటుంబానికి విక్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో వీరిద్దరితో పాటు వారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరి పేర్ల మీద ఆ భూమి కొనసాగుతున్నది. 2016లో నిబంధనల ప్రకారం నాలా మార్పు (వ్యవసాయ భూమి నుంచి నివాసయోగ్యం) చేసుకున్నారు. 2019లో సర్వే చేయించుకొని హద్దులను గుర్తించిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. అంటే 26 సంవత్సరాల నుంచి ఆ భూమి వారి ఆధీనంలోనే ఉన్నది. ఆరేండ్ల కిందట కొందరు వ్యక్తులు గేటు మీద ఉన్న యజమానుల పేర్లను తొలగించి సుబ్బారెడ్డి అని పేరు రాశారు. తాను జమ్మల నగేశ్ నుంచి ఎకరం భూమిని కొనుగోలు చేసినట్టు సుబ్బారెడ్డి డాక్యుమెంట్ సృష్టించాడు. అప్పటి నుంచి భూమిని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించినా ఎప్పటికప్పుడు రేఖారెడ్డి కుటుంబం నిలువరిస్తూ వచ్చింది.
దీంతో చాలాకాలం పాటు ఆ భూమి వైపు కన్నెత్తి చూడని సుబ్బారెడ్డి ఇటీవల కాలంలో తిరిగి తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలను ఆశ్రయించడంతో ఎంపీ సహా కాంగ్రెస్ యువ నేత ఒకరు ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఓ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని చక్రం తిప్పారు. చివరకు సదరు మంత్రితో తహసీల్దార్‌కు ఫోన్ చేయించి సహకరించాలని సూచించినట్టు తెలిసింది. పోలీసులకు కూడా ఇదేరీతిన ఫోన్లు వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. అసలే అధికార పార్టీ నేతల అండ, పైగా మంత్రి నుంచి ఫోన్ కాల్స్.. ఇంకేముంది సుబ్బారెడ్డి మూడు రోజుల క్రితం 50 మందిని తీసుకెళ్లి రేఖారెడ్డి కుటుంబానికి చెందిన భూమి మీదకు వచ్చి ప్రహరీని తొలగించి, చెట్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించాడు.
అధికార యంత్రాంగం సహకారం
రికార్డుపరంగా అది రేఖారెడ్డి భూమి అయినప్పటికీ రెవెన్యూ అధికారులు సుబ్బారెడ్డికి కూడా సర్వే రిపోర్టు ఇవ్వడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. తమ భూమి మీదకు అక్రమంగా వచ్చి ప్రహరీ కూల్చారని బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు విచారణ పేరిట తొలుత కేసు చేయకుండా తొక్కిపెట్టినట్టు తెలుసున్నది. చివరకు ఓ మంత్రి ఈ కబ్జా తతంగంలో కబ్జాదారులకు సహకారం అందిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆదివారం రాత్రి వరకు విచారణ చేస్తున్నామంటూ దాటవేసిన పోలీసులు పొద్దుపోయిన తర్వాత కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. సుబ్బారెడ్డి నకిలీ డాక్యుమెంట్ సృష్టించడంలో కొందరు రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మా భూమిని కాపాడండి
రూ. 50 కోట్ల విలువైన తమ భూమికి నకిలీపత్రాలు సృష్టించి కొందరు కబ్జాకు ప్రయత్నిస్తున్నట్టు భూమి యజమానులు రజితారెడ్డి, రేఖారెడ్డి ఆరోపించారు. రాంపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 385లో 1999లో తమ కుటుంబ పెద్దలు ఎకరం కొనుగోలు చేశారని, అప్పటి నుంచి 26 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. 2016లో నాలా మార్పు చేయించి సర్వే చేయించామని, 2019లో సర్వే చేయించి హద్దులు గుర్తించి ప్రహరీ నిర్మించినట్టు చెప్పారు. అదే ఏడాది గుర్తు తెలియని వ్యక్తులు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసి సర్వే నంబర్ 386 అని రాసుకున్నారని తెలిపారు.
2023లో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. 2025, ఆగస్టు 16న సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అక్కడ కేసు నడుస్తుండగానే తమపై కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు.మూడ్రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి భయపెట్టాడని, ప్రహరీ తొలగించి చెట్లను ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారులు సర్వే రిపోర్టు ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించి ప్రహరీ కూల్చి, భూమిని కబ్జా చేసిన ఆరోపణలపై సుబ్బారెడ్డితోపాటు ఆయన అనుచరుపై కేసు నమోదు చేసినట్టు కీసర సీఐ ఆంజనేయులు తెలిపారు.
నేను భూమిని అమ్మింది రేఖారెడ్డికే
రాంపల్లిలోని సర్వే నంబర్ 385లో ఉన్న ఎకరం భూమిని 1999లో రేఖారెడ్డి కుటుంబానికే విక్రయించాం. సుబ్బారెడ్డి అనే వ్యక్తికి నేను భూమిని అమ్మలేదు. ఆయన వద్ద ఉన్నవి ఫోర్జరీ డాక్యుమెంట్లు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి.
-జమ్మల నగేశ్
మా భూమిని కాపాడండి
రాంపల్లి సర్వే నం.385లో 26 ఏండ్ల కిందట భూమిని కొని, సాగు చేసుకుంటున్నాం. 2016లో ఒకసారి, 2019లో మరోసారి సర్వే చేశాం. హద్దులు గుర్తించి గోడ కట్టినం. కొందరు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే.. దానిపై 2023లో పోలీసులకు ఫిర్యాదు చేసినం. విషయం కోర్టులో ఉండగానే మూడ్రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి ప్రహరీ తొలగించి, చెట్లను ధ్వంసం చేశారు. మా భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాకు న్యాయం చేయాలి.
– భూమి యజమానులు రజితారెడ్డి, రేఖారెడ్డి