హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం మంచిర్యాలకు చెందిన ఎన్నారై భూమిని విరా ళం ఇచ్చారు. మంచిర్యాల పట్టణం హమాలీవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పకన ఉన్న తన ఎనిమిది గుంటల భూమిని ఎన్నారై ఇసంపల్లి రమేశ్‌బాబు బడికి విరాళంగా అందజేశారు. ఆ భూమి పత్రాలను మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూ ర్మాచలంతో కలిసి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డపై ప్రేమ చూపుతూ, మన ఊరు-మ న బడి కార్యక్రమానికి స్పందించి భూ విరాళం అందజేయటం స్ఫూర్తిదాయకమని మంత్రి కేటీఆర్ అభినందించారు. సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని రమేశ్ తెలిపారు. ఇటీవల లండన్‌లో పర్యటించిన కేటీఆర్ తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి లో ప్రభుత్వంతో కలిసిరావాలని ఎన్నారైలకు ఇచ్చిన పిలుపుతో తాను స్ఫూర్తి పొంది తన వంతు సహకారం అందించానని చెప్పారు.