Akbaruddin Owaisi | మూసీ ప్రక్షాళనతో నిరుపేదల బతుకులు చితికిపోవద్దని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అసలు మూసీ ప్రక్షాళన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారని ప్రశ్నించారు. వికారాబాద్ నుంచి గండిపేట వరకు ప్లాన్స్ ఏంటో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ ప్రక్షాళనపై జరిగిన చర్చలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన వికారాబాద్ నుంచి చేస్తారా? మధ్యలో నుంచి చేస్తారా అని ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందని అడిగారు. ప్రపంచంలో కాలుష్యంలో మూసీ 8వ స్థానంలో ఉందని తెలిపారు.
మూసీ – ఈసా నదులు కావు.. అవి ఇప్పుడు సీవరేజ్ ప్లాంట్లు అని అక్బరుద్దీన్ విమర్శించారు. నగరంలోని మురుగు అంతా మూసీ నదిలోకే వెళ్తోందని తెలిపారు. గండిపేట జలాశయంలో కూడా మురుగు నీరు కలుస్తుందని అన్నారు. దశాబ్దాల కింద నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో పూడిక తీసి, వాటి సామర్థ్యం పెంచాలని కోరారు. నీటి నిల్వ సామర్థ్యం పెంచితే గోదావరి జలాలను తరలించవచ్చని తెలిపారు. చార్మినార్ వద్ద మూడేళ్ల కిందట మొదలుపెట్టిన పెడస్ట్రేరియన్ ప్రాజెక్టు ఏమైందని ప్రశ్నించారు.