ఖిలావరంగల్: మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున అన్నారు. గురువారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏ ఐ ఎఫ్ డి ఎస్) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4 కాలేజీలు ఉండగా 3 కాలేజీలకు ఈ నెల 3వ తేదీన అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
వరంగల్ మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలకు మౌలిక వసతులు, ప్రాక్టికల్స్ కు ల్యాబ్ సౌకర్యం ఉన్నప్పటికి కళాశాలను ఎత్తివేసే ఆలోచనలో ఉంది కాబట్టే నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఈ నోటిఫికేషన్ చూసిన వెంటనే వెటర్నరీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసిన నోటిఫికేషన్ సవరణ చేసి వరంగల్ మామునూరు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, జిల్లా నాయకులు పోలబోయిన రాజు, గాదె ప్రణయ్, పరిమళ శశిధర్, బండి అరుణ్, పి. కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.