హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 ( నమస్తే తెలంగాణ ): ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు సంస్థ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుంటే, సమ్మె విరమింపజేసే చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం మాత్రం కార్మికులను మరింత రెచ్చగొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణ నియామకం పేరుతో కండక్టర్లు, డ్రైవర్లు కావాలంటూ రీజియన్ల వారీగా సమ్మె తొలిరోజు నుంచే నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం.
పదో తరగతి అర్హత ఉన్నవారిని కండక్టర్లుగా, హెవీ మోటర్ లైసెన్స్ ఉన్నవారిని డ్రైవర్లుగా ఎంపిక చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చెంగిచెర్ల, ఉప్పల్, కుషాయిగూడ, రాణిగంజ్, కంటోన్మెంట్, హకీంపేట, మేడ్చల్, జీడిమెట్ల, కూకట్పల్లి, హెచ్‌సీయూ, మియాపూర్ 1, 2 డిపోల్లో తక్షణమే డ్రైవర్లు, కండక్టర్లు కావాలని తాజాగా ప్రకటించారు. ఈ నియామక విధానంపై కార్మికులు మండిపడుతున్నారు. యాజమాన్యం తీరుపై ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బస్సు నడుపాలంటే ప్రత్యేక శిక్షణ తప్పనిసరి అని ఆర్టీవోలు తేల్చి చెప్తున్నారు. ట్రాఫిక్‌తో కూడిన నగర రోడ్లపై బస్సు నడుపడం ఆషామాషీ కాదని హెచ్చరిస్తున్నారు. నగరంలోని రూట్లపై సరైన అవగాహన లేకుంటే మరింత నష్టమని పేర్కొన్నారు. హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ ఉన్న వారి జాబితాను సిద్ధం చేయాలని ఆర్టీవోలపై ఆర్టీసీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తున్నది.
దీంతో రోజువారీ సాధారణ పనులు పక్కనబెట్టి ఆర్టీవోలు హెవీమోటర్ లైసెన్స్ కలిగిన వారికి ఫోన్లు చేసి మరీ రప్పిస్తున్నట్టు సమాచారం. రోజువారీ జీతం ఇస్తామని వారిని ఒప్పించి పంపుతున్నారు. అవగాహనా రాహిత్యంతో ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.