Inter Board | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2024-25 విద్యాసంవ్సరంలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియట్ బోర్డు శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని కాలేజీలు షెడ్యూల్ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి శృతి ఓఝా ఒక ప్రకటనలో తెలిపారు. కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందాకే నడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త కాలేజీల ఏర్పాటుకు అవకాశం లేకపోగా, ఇప్పటికే నడుస్తున్న కాలేజీలకు గుర్తింపును ఇవ్వడంతోపాటు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. జూన్ కంటే ముందు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమవుతున్నది. ఈ నేపథ్యంలో మందుగానే అనుమతులు మంజూరు చేస్తే గందరగోళానికి తావుండదన్న ఆలోచనతో ఇంటర్‌బోర్డు అనుమతుల జారీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆలస్య రుసుము లేకుండా కాలేజీ యాజమాన్యాలు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉన్నది. ఆలస్య రుసుముతో మే 5 వరకు అవకాశం కల్పించారు. కళాశాల భవన రిజిస్ట్రేషన్ డీడ్ లేదా లీజు డీడ్, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ, కార్పస్ ఫండ్, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్, బోధనా సిబ్బంది డాక్యుమెంట్లు, ఆటస్థలం డాక్యుమెంట్లను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల
ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లను అధికారులు వెబ్సైట్లో విడుదల చేశారు. విద్యార్థులు www.tsbie.cgg.gov. inలో తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓఝా ఒక ప్రకటనలో తెలిపారు. పొరపాట్లు ఉంటే వెంటనే డీఐఈవోలను సంప్రదించి సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.
దరఖాస్తుల షెడ్యూల్ ఇలా
ఆలస్య రుసుము లేకుండా 31-3-24
ఆలస్య రుసుముతో..
1,000 07-4-24
5 వేలు 14-4-24
10 వేలు 21-4-24
15 వేలు 28-4-24
20 వేలు 05-5-24