Lagacharla | మహబూబ్‌నగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లగచర్ల తండాల్లో మళ్లీ అలజడి రేగింది. ‘కొడంగల్ నియోజకవర్గంలో 3 లక్షల ఎకరాల భూమి ఉన్నది.. అందులో 1300 ఎకరాలు సేకరిస్తే తప్పేంది?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన మళ్లీ ఆ తండాల్లో వణుకు పుట్టిస్తున్నది. ‘మాతానే భూములున్నాయా? నీ కొండారెడ్డిపల్లిలో లేవా? కోస్గిలో లేవా? ఇక్కన్నే ఎందుకు? మమ్మల్ని ప్రశాంతంగ బతకనివ్వరా?’ అంటూ అమాయక గిరిజనం నిలదీస్తున్నది. ‘నీ 20 లక్షలు ఎవనిగ్గావాలె? మమ్మల్ని సంపినా సరే.. సూది మొనంత జాగ కూడా ఇయ్యం’ అంటూ తెగేసి చెప్తున్నది. ఫార్మా క్లస్టర్‌కు సేకరించాల్సిన భూసేకరణను ఉపసంహరించుకున్న 48 గంటల్లోనే మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూ సేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ లగచర్లతండాల్లో గుబులు రేపింది. ఇప్పటికే భయంతో చాలామంది పారిపోగా లగచర్ల, రోటిబండతండా, పులిచర్లతండాలో కేవలం మహిళలు, ముసలోళ్లు, చిన్నపిల్లలే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. లగచర్ల ఘటన జరిగి 22 రోజులు గడుస్తున్నా తమ వాళ్ల ఆచూకీ తెలియక విలవిలాడుతున్నారు. మరి కొంతమంది జైళ్లలో మగ్గుతున్నారు. వారిని చూసేందుకు వెళ్లలేక, తమ వాళ్లు ఎప్పుడు వస్తారా అని వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. కనీసం జైల్లో ఉన్న వారిని విడిపిస్తారని ఆశించినా.. తన మీదే కేసులు ఉన్నాయని రేవంత్ చెప్పకనే చెప్పి సహాయ నిరాకరణ చేయడంపై మండిపడుతున్నారు.
ఆగని పోలీసుల సెర్చ్ ఆపరేషన్
జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తండాల్లో ఆగిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభమైంది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా విచారించి అమాయకులపై చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించినా పోలీసులు మాత్రం మళ్లీ తండాల్లో తిష్ట వేశారు. ఏకంగా మహిళల దగ్గరికి వెళ్లి ‘మీ వాళ్లు ఎక్కడికి వెళ్లారో చెప్పండి.. లేకపోతే మీకే నష్టం’ అంటూ బెదిరిస్తున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేసులైన వారిపై పోలీసులు నిఘా పెంచారు. తండాల్లో ఉన్న గిరిజనుల ఫోన్ నంబర్లు తీసుకొని కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అనుమానితుల ఫోన్లపై నిఘా ఉంచారు. మళ్లీ పోలీసుల రాకతో లగచర్ల తండాలు భయంతో వణికి పోతున్నాయి.
బిక్కుబిక్కుమంటూ బతుకులు
పోలీసులకు భయపడి గిరిజనులు పొలాలు, పొదల్లో దాక్కుంటున్నారు. చాలామంది ఇండ్లకు తాళాలు వేసుకుంటున్నారు. చీకటి పడ్డాక వచ్చి ఇంత కలో గంజో తాగి రాత్రయితే మహిళలంతా ఒక్కచోటి చేరి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ‘ఈ రాత్రి గడిస్తే చాలు దేవుడా’ అంటూ మొక్కుకుటున్నారు. 22 రోజుల్లో 24 గంటలు మాత్రమే ప్రశాంతంగా ఉన్న లగచర్ల తండాలో మళ్లీ భయం పెరిగింది. తాజాగా సీఎం ప్రకటనపై లగచర్లవాసుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ బృందం పర్యటించింది. పోలీసులు, నమస్తే తెలంగాణ బృందం తప్ప లగచర్ల, రోటిబండతండా, పులిచర్ల తండాల్లో ఇండ్లన్నీ తాళాలు వేసి కనిపించాయి. గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. పోలీసు వాహనాలను చూస్తేనే స్థానికులు భయపడిపోతున్నారు. 22 రోజులుగా తమ గ్రామాలకు రావాలంటే చుట్టాలు కూడా భయపడిపోతున్నారని తామేం పాపం చేశామని అక్కడున్న కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం ప్రకనటపై మండిపాటు
ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ జరుగుతుందని శనివారం సాక్షాత్తు సీఎం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వేదికగా చేసిన ప్రకటనపై దుద్యాల మండలంలోని గ్రామాలవారు మండిపడుతున్నారు. జైళ్లలో ఉన్న తమ వారిని విడిపిస్తారనుకుంటే సీఎం అలాంటి ప్రకటన ఏదీ చేయక పైగా తప్పించుకునేలా మాట్లాడడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎండిపోతున్న పంటలు..
ఫార్మా క్లస్టర్‌కు భూములిచ్చేది లేదని తిరగబడ్డ గిరిజన తండాల్లో పరిస్థితి ఘోరంగా మారింది. అదే రోజు అర్ధరాత్రి పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఘటనతో సంబంధం ఉన్న వాళ్లను, లేని వాళ్లను కూడా తీసుకెళ్లి జైళ్లలో వేయగా చాలామంది అప్పటికే భయంతో పారిపోయారు. దీంతో గ్రామాల్లో మగవాళ్లు లేక వ్యవసాయ పనులన్నీ ఆగిపోయాయి. కోతకు వచ్చిన దశలో వరి పంటలు ఎండిపోతున్నాయి. పల్లి పంటకు నీళ్లు మళ్లించే వారే లేక మహిళలే పంటలు కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోసిన పంటను అమ్ముకొచ్చే మగదిక్కు లేక కన్నీటిపర్యంతమవుతున్నారు.
భూములిచ్చి రౌడీలమనిపించుకోవాల్నా
మేము భూములియ్యాలె.. మళ్లీ రౌడీలమనిపించుకోవాలెనా? ఇదెక్కడి న్యాయం సారు? మేమేం పాపం చేసినం? మాతానే భూములున్నాయా? నీ కొండారెడ్డిపల్లిలో లేవా? కోస్గిలో లేవా? ఇక్కన్నే ఎందుకు? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? మమల్ని సంపినా సరే.. మా భూములు ఇయ్యంగాక ఇయ్యం. సూది మొనంత జాగా కూడా ఇయ్యం.
-సోనీబాయి, రోటి బండతండా, దుద్యల మండలం, వికారాబాద్ జిల్లా
మీ ఊర్లె ఏసుకో..
భూమి మీద చేసుకొని బతికేటోళ్లం. మా భూములిచ్చి మేమేడికి పోవాలె? మాకు ఏ కంపెనీ వద్దు.. ఏదీ వద్దు. మా భూములు మాకే కావాలె. ఎట్ల రద్దు చేసిండ్రో అట్లనే వదలిపెట్టాలె. నీ కంపెనీలు కావాల్నంటే వేరేతాన ఏస్కో.. కోస్గి అవతల ఏస్కో.. మీ ఊర్లె ఏస్కో. ఏడాది కూడా కాలేదు.. గెలిపించిన పాపానికి మమ్మల్ని రౌడీలను చేసిండు. ఇంత అన్యాయమా?
– మీరాబాయి, రోటిబండతండా, దుద్యల మండలం, వికారాబాద్ జిల్లా
మా భూములపై మీ పెత్తనమేంది?
తండాలకు పోలీసోళ్లను తోలుతడా? మా భూమి మీద మీ పెత్తనమేంది? మీకెక్కడిది హక్కు? భూమి.. భూమి.. అంటున్నవ్. మా మొగోళ్లను ఇప్పుడిడుస్త, రేపు ఇడుస్త అంటున్నవ్. వాళ్లెవరినన్న సంపిండ్రా? మళ్లా చెప్తున్నం. మమ్మల్ని సంపినా భూములియ్యం
సూదిమొనంత జాగ కూడా ఇయ్యం.
– దేవీబాయి, రైతు (పులిచెర్లకుంట తండా )