సంగారెడ్డి సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): పచ్చిన పల్లెల్లో ఫార్మాసిటీ చిచ్చుపెడుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, ప్రజలు భగ్గుమంటున్నారు. డప్పూరు, వడ్డీ, మాల్గి పరిధిలో 1,983 ఎకరాల్లో ఫార్మాసిటీ, లైఫ్సైన్సెన్ హబ్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మాసిటీ పేరుతో తమ భూములను బలవంతంగా లాక్కోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల ఫార్మా భూములను చూసేందుకు వచ్చిన అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీవో రాజు, ఇతర రెవెన్యూ అధికారులను అడ్డుకుని ఘెరావ్ చేశారు. భూసేకరణను నిలిపివేయాలంటూ మంగళవారం ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది.
జహీరాబాద్ నియోజకవర్గంలో మంజీరా నదికి సమీపంలో ఉన్న న్యాల్కల్ మండలం పచ్చని పంటలకు నెలవు. నల్లరేగడి భూముల్లో రెండు పంటలతో సంతోషంగా ఉన్న న్యాల్కల్ మండల రైతులపై మొదట నిమ్జ్ పిడుగుపడింది. నిమ్జ్ ఏర్పాటు కోసం రేజింతల్, న్యామతాబాద్, హద్నూర్, బసంత్‌పూర్, రుక్మాపూర్, ముంగి తదితర గ్రామాల్లో తొమ్మిది వేల ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటికే సుమారు రెండువేల ఎకరాల భూ సేకరణ పూర్తయ్యింది. భూసేకరణ ప్రకియ కొనసాగుతున్నది. నిమ్జ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే రైతులు ఆందోళనచేయడంతోపాటు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కార్ న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన న్యాల్కల్ మండల రైతులు తాజాగా ఫార్మాసిటీ ఏర్పాటుతో సారవంతమైన భూములను కోల్పోనున్నారు. హైదరాబాద్ సమీపంలో తలపెట్టిన అతిపెద్ద ఫార్మాసిటీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి, న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటుపై స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో జీరో డిశ్చార్జ్ కంపెనీల ఏర్పాటుకు ఫార్మా కంపెనీలు ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి సమీపంలో కాకుండా న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఎవరి లాభం కోసం అనే చర్చ నడుస్తున్నది.
న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు 1,983 ఎకరాల భూ సేకరణ కోసం గత నెల 21, 23 తేదీల్లో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 1,070 ఎకరాల పట్టా భూమిని, 912 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించనున్నారు. డప్పూరు గ్రామంలో 930 ఎకరాల పట్టా, 516 ఎకరాల అసైన్డ్భూమి, వడ్డి గ్రామంలో 61.30 ఎకరాల పట్టా, 220.23 ఎకరాల అసైన్డ్భూమి, మాల్గి గ్రామంలో 79.33 ఎకరాల పట్టా, 176.8 ఎకరాల అసైన్డ్‌భూమిని సేకరించనున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో అసైన్డ్‌భూముల్లో పంటలు సాగు చేసుకుని జీవిస్తున్న 1,000కిపైగా పేద కుటుంబాలు భూసేకరణతో రోడ్డున పడనున్నాయి. ప్రస్తుతం ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల విలువ ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది. రెండు పంటలు పండే ఇంత విలువైన భూముల్లో కాలుష్యకారకమైన ఫార్మా కంపెనీలకు ఇస్తే తమ బతుకులు ఏమి కావాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మాకు ఉన్నదే ఎకరం భూమి. దీనిని కూడా ఫార్మాసిటీకి లాక్కుంటే ఎలా బతకాలి? మా కుటుంబ జీవనం ఆస్తవ్యస్తమవుతుంది. అందుకే ప్రాణాలు పోయినా సరే భూములను ఇచ్చేది లేదు. ప్రభుత్వం ఫార్మాసిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– బేగరి విఠల్, రైతు, డప్పూర్, న్యాల్కల్ మండలం