టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) బాలీవుడ్‌లోకి ఎంటర్ ఇవ్వడమే కాకుండా అక్కడ ఏకంగా ఆరు భారీ ప్రాజెక్టులు నిర్మించనున్నట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) నిర్మాణ సంస్థ తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
కొన్ని రోజులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. మేము ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు బాలీవుడ్‌తో సంబంధం ఉన్నట్లుగా వార్తలు సృష్టిస్తున్నారు. ఇది వాస్తవం కాదు. మేము బాలీవుడ్లో ప్రస్తుతం ఒక్క ప్రాజెక్టు మాత్రమే చేస్తున్నాం. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా, దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. అప్పటివరకూ ఈ రూమర్స్‌ను నమ్మవద్దని, అవాస్తవాలను ప్రచారం చేయవద్దని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము అని నిర్మాణ సంస్థ తన నోట్లో స్పష్టం చేసింది.
దిల్ రాజు నిర్మాణంలో తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్‌లో హీరోగా అక్షయ్ కుమార్ నటించనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.