Akhanda | టాలీవుడ్లో మాస్ హీరో నందమూరి బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అభిమానులకు పండుగే. ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి ఘన విజయాల తర్వాత ఈ జంట ‘అఖండ 2 : తాండవం’ అనే పవర్ ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం, ట్రైలర్, టీజర్లు, మ్యూజిక్‌తోనే అంచనాలు అమాంతం పెరిగాయి. డిసెంబర్ 4 నుంచే పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేయడంతో హైప్ మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పటికే పరిశ్రమలోనూ ఈ సినిమాపై భారీ నమ్మకం నెలకొంది. ప్రీ–రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరగడం, ఫ్యాన్స్‌లో హంగామా చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామి రానుందనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది.
ఈసారి బాలయ్య మరింత రౌద్రంగా, మరింత ఆధ్యాత్మికంగా కనిపిస్తారు అని టీమ్ చెప్పడం సినిమాపై భారీ అంచనాలు పెంచింది. అయితే అఖండ 2 ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు “అఖండ 3 కూడా రావొచ్చు” అని పరోక్షంగా ఇచ్చిన హింట్ ఇప్పుడు నిజం అని అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్.. బోయపాటి శ్రీను, చిత్ర యూనిట్‌తో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో వారి వెనుక ఉన్న డిజిటల్ స్క్రీన్‌పై పెద్ద అక్షరాల్లో “JAI AKHANDA” అంటూ కనిపించడం నెట్టింట్లో పెను చర్చకు దారి తీసింది. దాంతో ‘అఖండ 3 టైటిల్ ఇదే… జై అఖండ కన్ఫర్మ్!’ అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు వరదలా పెడుతున్నారు.
“మళ్లీ రౌద్ర తాండవం ప్రారంభం అవుతోంది!”, “బాలయ్య మాస్ హంగామాకి రెడీ అవ్వండి!”, “అఖండ 2 రిలీజ్‌కే ముందు అఖండ 3 టైటిల్? ఇది నిజంగా షాక్!” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘JAI AKHANDA’ టైటిల్ గురించి చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అఖండ 2 క్లైమాక్స్‌లోనే అఖండ 3కు హింట్ ఇచ్చి ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య మాస్ ఇమేజ్, అఖండ యూనివర్స్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఈ టైటిల్ పూర్తిగా సరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా… ‘JAI AKHANDA’ లీక్ అభిమానుల్లో డబుల్ ఎనర్జీ, డబుల్ పూనకం తీసుకొచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.