Virat Kohli | టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో రాణించిన కింగ్ కోహ్లీ.. తాజాగా రాయ్‌పూర్‌లో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేశాడు. కోహ్లీ 90 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. వన్డేల్లో 53వ సెంచరీ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 84వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు 100 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
2027 వరకు వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడా? లేదా? అన్ని చర్చ సాగుతుంది. అయితే, గత కొద్దిరోజులుగా విరాట్ కోహ్లీ ఫామ్ లేకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో విరాట్ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు చేసి మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. తాను 2027 వరల్డ్ కప్ వరకు ఆడగలనని చాటి చెప్పాడు. విరాట్ ప్రస్తుత ఫామ్‌ని పరిశీలిస్తే ప్రపంచకప్ వరకు ఆడగలడని విశ్లేషకులు భావిస్తున్నారు. విరాట్ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటికే టెస్టులతో పాటు టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, రెండేళ్ల తర్వాత జరిగే ఈ ఐసీసీ టోర్నీ కోసం తన ఫిట్నెస్ను ఎలా కాపాడుకుంటాడన్న చర్చ సాగుతుండగా.. ఈ సిరీస్‌లో వరుస సెంచరీలతో కోహ్లీ విమర్శలకు సమాధానం ఇచ్చాడు.