హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు. త్వరలోనే 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. నిరుద్యోగులకు నేను చెప్తున్నా.. మంచి ఉద్యోగ కల్పన జరుగుతోంది. ఉద్యోగ నియామకాలకు క్యాలెండర్ విడుదల చేస్తాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా నిబంధనలు రూపొందించాం. నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తోంది.
జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులను సర్దుతున్నాం. ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తాం. నవంబర్లో ఉద్యోగుల సర్దుబాటు పక్రియ పూర్తి చేసి.. 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుపుతాం. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు అని సీఎం కేసీఆర్ అన్నారు.