హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పౌరసరఫరాల సంస్థ సేకరించిన ధాన్యాన్ని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి చేపట్టిన న్యాయపోరాటంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ-వేలంలో ధాన్యాన్ని దకించుకున్న ప్రైవేటు కంపెనీలకు కూడా తాఖీదులు అందాయి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులైన పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి, పౌరసరఫరాల సంస్థ ఎండీ, కమిషనర్, జనరల్ మేనేజర్, మారెటింగ్ జనరల్మేనేజర్, భారత ఆహార సంస్థ, ఈ-టెండరు దకించుకున్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్, మంచుకొండ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్, ఎల్జీ అగ్రి ఇండస్ట్రీస్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఖజానాకు 1100 కోట్ల నష్టం
దాన్యం కొనుగోలుకు నిర్వహించిన టెండర్లో పేరొన్నదాని కంటే మిల్లర్ల నుంచి అదనంగా వసూలు చేయడంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, ధాన్యం కొనుగోలు టెండర్ల ద్వారా భారీ నష్టం వచ్చేలా చేసిన అధికారులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. దీనిపై పిటిషనర్ ఫిర్యాదు చేసినా ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏజన్సీల మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకల ఫలితంగా రూ.1100 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు.
అక్రమాల వెనుక పెద్దల హస్తం: పెద్ది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో భారీ కుంభకోణం జరిగిందని పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు. నర్సంపేటలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బిడ్డర్ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా పూర్తి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు బీఆర్ఎస్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఈ వ్యవహారంలో పెద్దల హస్తం ఉన్నదని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వడ్ల కుంభకోణం జరిగిందిలా..
బీఆర్ఎస్ హయాంలో సేకరించిన రూ.7 వేల కోట్ల విలువచేసే 35 లక్షల టన్నుల ధాన్యం అమ్మకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. స్థానిక మిల్లర్లు ధాన్యాన్ని క్వింటాకు రూ.2,100 చొప్పున కొంటామని చెప్పినా, వారికి ఇవ్వకుండా టెండర్లు పిలిచింది. రూ.1,885 నుంచి రూ.2,007 కోట్ చేసిన కేంద్రియ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నకాఫ్ సంస్థలు దాన్యాన్నిదక్కించుకున్నాయి. ఈ నాలుగు సంస్థలు గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకెళ్లకుండా క్వింటాకు రూ.2,230 చెల్లించాలని రాష్ట్రంలోని 4,000 రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేశాయి. 35 లక్షల టన్నుల ధాన్యానికి సగటున క్వింటాకు కనీసం రూ.200 చొప్పున అదనంగా వసూలు చేసినా రూ.700-800 కోట్లు అవుతుంది. ప్రభుత్వ పెద్దలే కావాలని తక్కువకు గ్లోబల్ టెండర్లు పిలిచి కట్టబెట్టారని, ఇందులో రూ.700 కోట్లు నుంచి 800 కోట్ల వరకు స్కామ్ జరిగిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తోపాటు బీజేపీకి కూడా ఆరోపించింది. గత ప్రభుత్వం సేకరించిన ధాన్యంలో 1.60 లక్షల టన్నుల సన్నబియ్యం ఉంటే వాటిని రూ.22కు అమ్మి అవే బియ్యాన్ని ఈ నాలుగు సంస్థల నుంచి కిలోకు రూ.57 చొప్పున కొన్నది. ఇందులో రూ.300 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నదని విపక్షాలు మండిపడ్డాయి.