హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): అక్రమ కట్టడాల పేరుతో హైడ్రా నోటీసులు ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేతలు చేపడుతున్నదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ వ్యక్తిగత హోదా లో పాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం సర్వే నిర్వహించే వరకు భవనాలను కూల్చివేయరాదని హైడ్రాకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పాల్ కోరారు.బాధితులకు నోటీసులు జారీ చేయాలని, వారు కోర్టు ను ఆశ్రయించేందుకు లేదా ఇండ్లను ఖాళీ చేసేందుకు కనీసం నెల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ స్పంది స్తూ హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం లేదని, నోటీసుల జారీ తర్వాతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నదని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. పిల్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.