హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందంకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన కృపానందం ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారిని నిర్దోషులుగా పేర్కొంటూ మే 6న సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై సీ బీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీబీఐ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం సబిత, కృపానందంను ఆదేశించారు. ఇదే కేసులో సీబీఐ కోర్టు దోషులుగా తేల్చిన గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి తదితరుల అప్పీళ్లతో కలిపి సీబీఐ అప్పీల్‌ను సెప్టెంబర్ 17న విచారిస్తామని తెలిపారు.
వాదనకు దిగారని కేసు నమోదు సరికాదు ; పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): విచారణ సందర్భంగా వా దనకు దిగారన్న కారణంతో పోలీసులు కేసు నమోదు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు తప్పుబట్టింది. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెం దిన అక్కినేని రాజశేఖర్ 2022లో మంగపేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని రాజశేఖర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. దీంతో రికార్డులను పరిశీలించిన న్యాయమూ ర్తి.. పోలీసుల తీరును తప్పుబడుతూ కేసును కొట్టివేశారు.