మక్తల్, ఆగస్టు 28 : నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ నిర్మాణానికి భూములు సేకరించే క్రమంలో నారాయణపేట ఆర్డీవో శంకర్ నాయక్ రైతులను ఒత్తిడికి గురిచేస్తూ అవార్డు కాపీలపై సంతకాలు పెట్టాలని బలవంతం చేస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. 2013 భూ సేకరణ చట్టానికి లోబడి భూములు కోల్పోయే రైతాంగానికి పరిహారం అందించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరసన కార్యక్రమాలలో అన్నదాతలు పాల్గొంటుంటే.. రెవెన్యూ సిబ్బంది రైతులు ఇండ్ల వద్ద లేని సమయం చూసి భూములు కోల్పోతున్న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లిలో గురువారం భూనిర్వాసితుల ఇండ్ల వద్ద బలవంతంగా రెవెన్యూ సిబ్బంది నోటీసులు అంటించి వెళ్లారు. తమకు న్యాయమైన పరిహారం అందిస్తేనే భూములు ఇస్తామని.. లేదంటే ఇచ్చేది లేదని పలువురు తెగేసి చెప్పారు. సీఎం ఇలాకాకు సాగునీరు తీసుకెళ్లేందుకు ఇక్కడి రైతులకు నష్టం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు.