Etala Rajender | వరంగల్ : టెన్త్ పేపర్ లీకేజీ( tenth Paper Leak ) కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etala Rajender )కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి కమలాపూర్ పీఎస్ ఎస్ఐ నేరుగా వెళ్లి నోటీసులు అందజేశారు.
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం( Hindi Question Paper ) లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్( Bandi Sanjay )ను ఏ1గా, బూర ప్రశాంత్‌ను ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఏ2 ప్రశాంత్.. బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్‌కు, ఆయన ఇద్దరు పీఏలు రాజు, నరేందర్‌కు కూడా హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా పంపాడు. దీంతో వారి పేర్లను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈటల రాజేందర్ స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేయనున్నారు.
అయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచి హిందీ ప్రశ్నపత్రం లీకైన సంగతి తెలిసిందే. కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి తెలుగు బిట్ పేపర్, హిందీ ప్రశ్నపత్రం లీక్ కావడంతో.. ఆ స్కూల్‌నే ఎందుకు ఎంచుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌ను విచారించి మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది.