హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఫ్యాకల్టీ లేనందున కోర్సుల నిర్వహణకు అనుమతులివ్వలేమంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు వర్సిటీలకు ఎడాపెడా అనుమతులిస్తూ పర్యవేక్షణను గాలికి వదిలేసిన యూజీసీ.. నిరుపేదలకు విద్యనందించే ప్రభుత్వ వర్సిటీలపై పర్యవేక్షణ పేరుతో నోటీసులు జారీ చేయడంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతున్నది.
వాస్తవానికి 2018లోనే యూజీసీ ఓడీఎల్, ఆన్లైన్ కోర్సుల నిర్వహణపై మార్గదర్శకాలిచ్చింది. ఓపెన్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల నిర్వహణకు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలని నిర్దేశించింది. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూల్లో ఉంది. వర్సిటీ విభజన ఇంకా పూర్తికాలేదు. వర్సిటీ పరిధిని ఇంకా నిర్ధారించలేదు. ఉద్యోగులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. పరిస్థితి ఇలా ఉంటే యూజీసీ మాత్రం కోర్సులకు అనుమతులివ్వలేమని నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది.
బీఆర్ఏఓయూకు యూజీసీ లేఖ రాసిన విషయంపై మాకు సమాచారమందింది. కోర్సుల నిర్వహణకు అనుమతివ్వాలని కోరుతూ యూజీసీ చైర్మన్కు త్వరలోనే లేఖరాస్తాం. యూజీసీ సైతం సానుకూలంగా స్పందించి అనుమతినిస్తుందని భావిస్తున్నాం. అడ్జెంట్ ప్రొఫెసర్లు, రిటైర్డ్ అయిన వారిని నియమించి ఫ్యాకల్టీ కొరత తీర్చే ప్రయత్నం చేస్తున్నాం.
– ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్