హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో ప్రధాన నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికే జైలుకు వెళ్లగా అతడికి సహకరించిన వారికీ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. నిందితుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేసిన వారిని సహ నిందితులుగా చేర్చనున్నట్టు తెలిసింది. ఈ మేరకు వారిపై పోక్సో చట్టంలోని 16, 17, 19, 21లలో ఏయే సెక్షన్లు వర్తిస్తాయనే విషయమై న్యాయ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. బాలికపై లైంగిక వేధింపుల కేసులో భగీరథ్‌కు తండ్రితో పాటు అతడి అనుచరుడు, స్నేహితులు కూడా ఉన్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లో రిచ్‌కిడ్ కేసులో తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పేట్ బషీరాబాద్ కేసులో మాత్రం నిందితుడికి సహకరించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో భగీరథ్ తండ్రితో పాటు అతని అనుచరుడు సంగప్ప, నిందితుడి స్నేహితులకు కచ్చితంగా నోటీసులు జారీ చేస్తారనే చర్చ జరుగుతున్నది.
ఆ ఐదు రోజులెక్కడ?
పోక్సో కేసు నమోదైన తర్వాత పరారీలో ఉన్న భగీరథ్ వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు సమాచారం. అయితే అతడికి ఈ ఐదు రోజుల పాటు ఆశ్రయం కల్పించిందెవరు?, అరెస్ట్ అయ్యేవరకు నిందితుడు ఎక్కడకక్కకి వెళ్లాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సెల్‌ఫోన్ లోకేషన్ల ఆధారంగా మ్యాపింగ్ చేస్తున్న పోలీసులు, నిందితుడి నుంచి కూడా సమాచారం సేకరించి ఈ మ్యాపింగ్‌ను ఫిక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా?
నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడం, రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రముఖ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నందున దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. నిందితుడితో పాటు అతడికి సహకరించిన వారికి నోటీసులు ఇవ్వకుండా వదిలేస్తే.. సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ బలం ఉన్న వారికి మరో న్యాయమా? అనే ప్రశ్నలు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తాయని పోలీసులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడితో పాటు సహకరించి వారిపైనా కఠిన చర్యలు తీసుకొని, బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.