హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ‘అమాయకులపైన అణగారిన వర్గాలపై కులం పేరుతో దాడిచేస్తే చర్యలు తీసుకోరా?’ అని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులపై దాడులు చేస్తే కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితులు, దాడికి గురైన దళితులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు నేతృత్వంలో గురువారం హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్యను కలిసి తమపై జరిగిన దాడి గురించి వివరించారు.
పెద్ద ధన్వాడలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం గాయత్రి రెన్యూవబుల్ అల్లాయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గత జూన్ 3న కంపెనీ సీఈవో, ప్రైవేట్ బౌన్సర్ల సాయంతో పనులు ప్రారంభించడానికి వచ్చారని తెలిపారు. జూన్ 4న పెద్ద ధన్వాడ గ్రామస్థులంతా ఫ్యాక్టరీకి వ్య తిరేకంగా శాంతియుతంగా రోడ్డుపై ధర్నాకు దిగడంతో, సీఈవో బీ మంజునాథ్, బౌన్సర్లు బాధితులను కులం పేరుతో దుర్భాషలాడుతూ దాడి చేయడంతో తలలు పగిలి, 10 కుట్లు పడ్డాయని మరియమ్మ అనే దళిత మహిళ కమిషన్ చైర్మన్‌ను గోడు వెళ్లబోసుకుంది.
అనంతరం రాజోలి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టామని, 60 రోజులవుతున్నా చర్యలు తీసుకోకుండా తిరిగి గ్రామ రైతులపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితుల గోడు విన్న కమిషన్ చైర్మన్ ఈ ఘటనపై ఇంతవరకు తీసుకున్న ఏటీఆర్‌ను పంపాలని కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలను ఆదేశించారు. కంపెనీ వారిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గద్వాల డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్యే విజయుడు, బాధితులు మరియమ్మ, భాసర్, మోశన్నరాజు పాల్గొన్నారు.