హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): ఆక్రమణల తొలగింపునకు సంబంధించి హైడ్రాకు మరిన్ని అధికారాలు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, వివిధ శాఖల కింద ఉన్న ఆక్రమణ స్థలాల పరిరక్షణకు నోటీసులు ఇచ్చే అధికారాన్ని హైడ్రాకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు సీఎస్ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడారు. చెరువులు, కుంటలు, పారు లు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల, జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయితీరాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేయడంతో గందరగోళం ఏర్పడుతున్నదని అభిప్రాయపడ్డారు. దీనిని నివారించడానికి ఓఆర్ఆర్ పరిధిలో అన్నిరకాల ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్, ల్యాండ్ గ్రాబింగ్, వాల్టా, నీటిపారుదల శాఖ చట్టాల ద్వారా జారీచేసే అన్ని రకాల నోటీసులు, తొలగింపులను హైడ్రా పరిధిలోకి తెస్తామని వివరించారు. గండిపేట, హిమాయత్‌సాగర్ చెరువుల పరిరక్షణ జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తెస్తామని వెల్లడించారు. హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వీటిని మరింత బలోపేతం చేయడానికి కావాల్సిన పోలీస్, సర్వే, నీటిపారుదల శాఖల నుంచి అధికారులు, సిబ్బందిని త్వరితగతిన కేటాయిస్తామని తెలిపారు.