శంషాబాద్ రూరల్, జనవరి 21: లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు చెల్లిస్తామని ఐటీశాఖ (ఇన్కమ్ ట్యాక్స్) పేరుతో శంషాబాద్ మండలంలోని పది మంది గిరిజన రైతులకు తపాలా శాఖ ద్వారా నోటీసులు అందడం కలకలం సృష్టించింది. పాలమాకుల పంచాయతీ అనుబంధ గ్రామం కలబండతండాకు చెందిన పది మంది రైతులకు రూ.లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు ఇస్తాం అని పోస్టు ద్వారా నోటీసులు అందాయి.
ఐటీశాఖ నుంచి తమకు నోటీసులు రావడం ఏమిటని స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రాజునాయక్ దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు సైబర్ నేరగాళ్ల పనే అని ఆయన మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఎవరికైనా ఇలాగే నోటీసులు వస్తే ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని సూచించారు. సదరు నోటీసులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో కే హిర్య, కే తేజ్య, లక్ష్మణ్, లింగ్యా, ఘోరి తదితరులు పాల్గొన్నారు.